ప్రగతికి పట్టుగొమ్మలైన గ్రామసీమలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా, స్థానిక సంస్థలకు చెందిన రూ.7,880 కోట్లను ప్రభుత్వం దొంగిలించింది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి, గోట్కూరు గ్రామ ప్రజలు బుధవారం లోకేష్ ను కలిసి సమస్యల గురించి విన్నవించారు. బ్రాహ్మణపల్లిలో అంగన్ వాడీ స్కూలు లేకపోవడంతో చిన్నపిల్లలకు పౌష్టికాహారం లేదు. 1 నుంచి 5వతరగతి వరకు పిల్లలు చదువుకునేందుకు ఎలిమెంటరీ స్కూలు లేదు. స్కూలు లేక ఇక్కడి చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిసి కాలనీలో డ్రైనేజి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్యానికి హాస్పటల్ కూడా లేదు.
గొట్కూరులోని సర్వే నెం.236లోని జగనన్న కాలనీలో ఇప్పటివరకు ఇళ్లపట్టాలు ఇవ్వలేదు. స్థలయజమానికి కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. ఆర్డీఓ, ఎమ్మార్వోలకు చెప్పినా పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యల పరిష్కారానికి కృషిచేయండి.అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేవిధంగా గ్రామాల్లో 25వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించాను. ప్రతి గ్రామంలో ఎల్ఇడి వీధిదీపాలతోపాటు ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లపై తట్ట మట్టిపోసే దిక్కు కూడా లేదు అని లోకేష్ విమర్శించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గొట్కూరు, బ్రాహ్మణపల్లి వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం.అని హామీ ఇచ్చారు.