టిడిపి అధికారంలోకి రాగానే సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా వాల్మీకిి సామాజిక వర్గీయులకు పూర్తి న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం జ్యోతిరావు పూలే సర్కిల్ లో రజక, వాల్మీకి సామాజిక వర్గీయులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో రజకుల తో పాటు బీసీలకు జగన్ తీవ్ర అన్యాయం చేశాడన్నారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వారిని మోసపుచ్చాడని ఆరోపించారు.
టిడిపి హయాంలో ఆదరణ పథకం క్రింద రజకులు కు వాషింగ్ మెషిన్ లు అందజేసినట్లు చెప్పారు. తిరిగి అధికారంలోకి రాగానే వాషింగ్ మెషిన్ లతో పాటు నెలకు 500 యూనిట్ లు ఉచిత విద్యుత్ అందజేయగలమని హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి రాగానే అసంపూర్తిగా వదలి వేసిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను పూర్తి చేస్తామని వెల్లడించారు. రజకులకు దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రజకులకు అధునాతన పద్ధతులు తో సమీకృత దోబీ ఘాట్ లు నిర్మిస్తామని తెలిపారు.