టిడిపి అధికారంలోకి వచ్చాక ఇసుక విధానాన్ని సరళీకరించి స్థానికులకు అందుబాటులోకి తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కడప వినాయక్ నగర్ జంక్షన్ లో 49వ డివిజన్ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక రూ.1300కు ఇంటికి చేరేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక యూనిట్ ఇసుక 8వేలు పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. వైసిపి ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు లేక కడపలో దాదాపు 500 ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, కూలీలకు పనులు లేకుండా పోయాయి.
చెరువులో మట్టి తోలాలంటే పెనాల్టీల పేరుతో వేధిస్తున్నారు. ఇసుక రేటు పెరగడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఫైనాన్స్ లో ట్రాక్టర్లు తెచ్చిన వారు డబ్బులు కట్టలేక ట్రాక్టర్లు కోల్పోయారు. మీరు అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానాన్ని తెచ్చి ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ధనదాహం కారణంగా 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. స్థానిక నదుల్లో ఇసుక ఇక్కడి ప్రజలకు దొరక్కుండా పొరుగురాష్ట్రాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క ఇసుకపైనే గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో రూ.10వేల కోట్లు దోచుకున్నారు. మళ్లీ నిర్మాణరంగాన్ని పరుగులు తీయించి కార్మికులకు చేతినిండా పని కల్పిస్తాం. రవాణా వాహనాలపై అడ్డగోలు జరిమానాలకు స్వస్తి పలికి, ఉపాధి కల్పిస్తాం.