టిడిపి అధికారంలోకి రాగానే నాయీబ్రాహ్మణులకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం సప్తగిరి సర్కిల్ లో ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవాసంఘం ప్రతినిధులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు.
క్షౌరవృత్తిదారులు, వాయిద్య కళాకారుల్లో 45ఏళ్లు నిండినవారికి పింఛను మంజూరు చేయాలని, అనంతపురం అర్బన్ పరిధిలో నాయీబ్రాహ్మణుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 20సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని, నాయీబ్రాహ్మణులు హెయిర్ సెలూన్లు ఏర్పాటుచేసుకునేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, ప్రముఖ దేవాలయాల్లో పనిచేసే క్షురకులను పర్మినెంట్ చేయాలని, అనంతపురం జిల్లాలో పంచాయితీలు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సుల్లో నాయీబ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా 500 యూనిట్ల విద్యుత్ కేటాయించాలని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. క్షౌరవృత్తిదారులు, నాయీబ్రాహ్మణులకు పరికరాల కొనుగోలు, సెలూన్ల ఏర్పాటుకు విరివిగా సబ్సిడీరుణాలు మంజూరు చేస్తామని, అవకాశమున్న చోట్ల పంచాయితీ, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సుల్లో షాపులు కేటాయిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.