యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో దుమ్మురేపింది. రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వరోజు పాదయాత్ర… మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ధర్మవరం ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీనాయకులు, అభిమానులు, ప్రజలు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. యాత్ర ధర్మవరంలోకి చేరుకోగానే… పట్టణమంతా జనసంద్రంగా మారింది. యువకులు కేరింతలు కొడుతూ పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు నీరాజనాలు పట్టారు. యువనేత రాకకోసం ధర్మవరం రోడ్లవెంట జనం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఎదురుచూశారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర్మవరంలో జనం స్వచ్చందంగా తరలిరావడంతో పార్టీశ్రేణులు ఆనందంతో పొంగిపోయాయి. తనని చూడటానికి రోడ్ల పైకి వచ్చిన ప్రజల్ని ఓపిగ్గా కలుస్తూ వారితో ఫోటోలు దిగుతూ సమస్యలు తెలుసుకున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు వాపోయారు. వైసిపి పాలనలో మైనార్టీలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని మైనారిటీలు చెప్పారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ వైసిపి పాలనలో అన్ని వర్గాలు బాధితులేనని, జగన్ ఒక కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఎవరూ ఆనందంగా ఉండకూడదు అనేది ఆయన కాన్సెప్ట్.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తాం. పన్నుల భారాన్ని తగ్గిస్తాం. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. ధర్మవరం శివార్లలో జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పాడుబెట్టిన టిడ్కో గృహాలను పరిశీలించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. నామాల క్రాస్ వద్ద సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదలచేయకపోవడంతో రెండేళ్లుగా జీతాలు లేవని ఆవేదన చెందారు.
యువనేత లోకేష్ స్పందిస్తూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తత తీసుకుని మరింత విస్తరిస్తానని, కార్మికుల సేవలు వినియోగిచుకుంటామని చెప్పి ముందుకు సాగారు. ధర్మవరంలో నిర్వహించిన యువనేత పాదయాత్రలో వివిధ వర్గాలనుంచి వినతులు వెల్లువెత్తాయి. చేనేత కార్మికులు, బలిజలు, రజకులు, ముస్లింలు, స్వర్ణకారులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. చంద్రన్న నేతృత్వంలో రాబోయే టిడిపి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటుందని చెబుతూ ముందుకు సాగారు.