గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరంలో గుట్టలు, చెరువులు, భూములు గుటకాయ స్వాహా చేస్తోన్న ఎమ్మెల్యే కేటురెడ్డి ఇవిగో నీ కబ్జాలకి ఆధారాలు ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బుధవారం ఎమ్మెల్యే బినామీలైన ఆయన అనుచరులు చేసిన కబ్జాలకి సంబంధించిన ఆధారాలు విడుదల చేశారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రధాన అనుచరుడు నారాయణరెడ్డి, స్థానిక వైసీపీ నేతలతో కలిసి చేసిన భూకబ్జాలు బయటపెట్టారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూకబ్జాలు బయటపెడితే అమరావతి పారిపోయి, ఉండవల్లి కరకట్టపై ఫోటో షూట్ ఛాలెంజ్ లు చేస్తున్నారని, అయినా సరే ఆయన ఛాలెంజ్ ను స్వీకరించామని చెప్పిన నారా లోకేష్ రెండో రోజు ఎమ్మెల్యే గ్యాంగ్ భూ ఆక్రమణల పత్రాలు, ఫోటోలు విడుదల చేశారు.
నారా లోకేష్ విడుదల చేసిన ఆధారాలు
1. ముదిగుబ్బ మండలం వైకాపా నాయకుడు నారాయణరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ప్రధాన అనుచరుడు. ముదిగుబ్బ మండల కేంద్రం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్ని సుమారు 30 ఎకరాల వరకు స్థానిక నాయకులతో కలిసి కబ్జా చేశారు.
2. బినామీలను ముందు పెట్టుకొని భూ ఆక్రమణలకు పాల్పడ్డారు.
3. ముదిగుబ్బ మండలం కేంద్రం చుట్టూ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండడంతో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా విలువ రెండు కోట్ల పైమాటే. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ముదిగుబ్బలో సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమించారు. దీని విలువ సుమారు 60 కోట్ల పైనే ఉంటుంది.
4. ముదిగుబ్బ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న దొరిగల్లు రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 2060-4 లో మూడు ఎకరాల భూమిని టిడిపి హయంలో ముస్లిం స్మశాన వాటికకు కేటాయించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్మశాన వాటిక కోసం కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమించి అదే వైకాపా నాయకుడి పేరుమీద ఆన్లైన్ లో ఎక్కించేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ మూడు ఎకరాల స్థలం విలువ 6 కోట్లకి పైగానే ఉంటుంది.
5. రెవిన్యూ అధికారుల్ని బెదిరించి పాస్ బుక్కులు కూడా చేయించుకున్నారు.
6. ముదిగుబ్బలో జాతీయ రహదారి అనుకొని గుంజేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1190-3 లో టిడిపి హయంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అప్పట్లోనే కొంతమంది ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఇళ్లు కట్టుకోని వారిని బెదిరించి స్థలాలు లాక్కున్నారు. స్థానిక వైసిపి నాయకులు సుమారు నాలుగు ఎకరాల వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కస్తూర్బా స్కూల్ కి ఆనుకొని ఉన్న స్టేడియంకు వెళ్లే దారిని కూడా వైసీపీ నేతలు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఇక్కడ సెంటు విలువ సుమారు రెండు లక్షల ఉంటుంది. ఈ లెక్కన వైసిపి నాయకులు ఆక్రమించిన భూమి విలువ సుమారు 8 కోట్లు.
7. ముదిగుబ్బ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న దొరిగల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1330-1 లోని 17 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారు. గుట్టను చదును చేసి ఫ్లాట్లుగా మార్చి సెంటు రూ. 2 లక్షల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో తహశీల్దారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుజేసినా లెక్కచేయకుండా గుట్టను కబ్జా చేశారు.
8. ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం-కదిరి జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఆరు ఎకరాల గుట్టను వైసిపి నాయకులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించుకున్నారు. గుట్టను చదును చేసి కంచె కూడా వేసి సెంటు రూ.1లక్ష చొప్పున విక్రయించారు.
9. ఇంత బరితెగించి, బహిరంగంగా గుట్టను ఆక్రమించుకున్నా అధికారులు పట్టించుకోలేదు.
10. ఇవన్నీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కనుసన్నల్లో ఆయన అనుచరులే చేసిన కబ్జాలు. గుడ్ మార్నింగ్ అంటూ గుట్టల్ని మింగేసిన ఎమ్మెల్యే గారు ఇవిగోంది మీ కబ్జాలకి ఆధారాలు, రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ లోకేష్ ప్రశ్నించారు.