టిడిపి అధికారంలోకి వచ్చాక జమ్మలమడుగు దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దపసుపుల చర్చివద్ద దళితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా కాలనీలో డ్రైనేజీ నిర్వహణను ఎవరూ పట్టించుకోవడం లేదు. మురుగునీరు గుంతలు, డ్రైనేజీల్లో నిల్వ కారణంగా దోమల బెడద అత్యధికమై నిత్యం అనారోగ్యాలకు గురవుతున్నాం.
దోమకాటువల్ల డెంగ్యూ జ్వరంతో రక్తకణాల సమస్య వచ్చి ఇద్దరు పిల్లలు మరణించారు. 20మంది ఆస్పత్రిపాలయ్యారు. వైసీపీ నాయకులు, అధికారులకు మా సమస్య ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి. మా కాలనీకి వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్ పాలనలో పేదలు, దళితుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి.
దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. జగన్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యరంగం కుప్పకూలింది. కర్నూలు, అనంతపురం వంటి పెద్దాసుపత్రుల్లో సైతం కనీసం దూది, గాజుగుడ్డలేని దుస్థితి నెలకొంది. గ్రామపంచాయితీల నిధులను ప్రభుత్వం దొంగిలించడంతో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా వారి వద్ద నిధుల్లేవు. ఇంటింటికీ కుళాయి అందజేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.