దోచుకోవటంలో వైసీపీ ప్రభుత్వం ఎవరికి మినహాయింపులు ఇవ్వటంలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. పోలీసులకు టార్గెట్ లు ఇచ్చి చలానాలు వసూలు చేయాలని వేధిస్తున్నాడని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాఫ్తాడు నియోజకవర్గం ఎస్ ఎస్ గేటు వద్ద ఆటోకార్మికులు లోకేష్ ను కలిసి తమ సమస్యలను వినంవించుకున్నారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ చంద్రబాబు హయాంలో ఆటో కార్మికుల సంక్షేమం కోసం లైఫ్ టాక్స్ ను రద్దుచేసినట్టు చెప్పారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ టాక్స్ ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తామని తెలిపారు. ప్రమాదం లో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తిరిగే ఆటోలకు సింగిల్ పర్మిట్లు ఇస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పెట్రోలు, డీజీలు ధరలు తగ్గింపుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.