- ముఖ్యమంత్రి ముందస్తు చర్యలే శ్రీరామరక్ష
- అప్రమత్తంగా వ్యవహరించిన ప్రభుత్వం
- సమష్టి యుద్ధంతో సాధించిన విజయమిది
- తుపాను నష్టాన్ని నివారించగలగిన కూటమి
- అనంతర పరిణామాలపైనా ముందస్తు చర్యలు
అమరావతి (చైతన్య రథం): ప్రకృతి విపత్తులను ఆపలేకపోవచ్చు. కానీ అప్రమత్తతతో భారీ నష్టాన్ని నివారించవచ్చని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్రమత్తంగా వ్యవహరించి.. రాష్ట్రస్థాయినుండి గ్రామస్థాయి వరకు యంత్రాంగాన్ని, సిబ్బందిని అలెర్ట్ చేయటంతో.. మొంథా తుఫాను పెనుముప్పును తప్పించగలిగారు. మొంథా తుఫానుకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు చేసే హెచ్చరికలు, సూచనలు ఆధారంగా కూటమి ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ తగు ముందస్తు భద్రత చర్యలను చేపట్టడంవల్ల భారీస్థాయిలో ప్రాణ పశు ఆస్తి నష్టాలను నివారించారు. అల్పపీడన ప్రభావంతో అక్టోబర్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరుగా కురవాల్సిన వర్షాలు 27వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి “మొంథా” తుపానుగా రూపాంతరం చెందింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగా ఈనెల 17నే మొంథా తుఫాను ముప్పును హెచ్చరించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ప్రతి జిల్లాకు ఐఏఎస్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించి తుఫాను ముప్పు నివారణ చర్యలను ముందస్తుగా చేపట్టారు. ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, సూచనలతో తుపానువల్ల సంభవించే నష్టాలను నియంత్రించే దిశగా అధికార యంత్రాంగం. గత మూడు రోజులుగా విధులు నిర్వహించింది. రాష్ట్రమంత్రులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తుఫాను ముప్పు నివారణ చర్యలను పర్యవేక్షించారు. విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర హెూమ్, విపత్తుల మంత్రి వంగలపూడి అనిత, విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రఖర్ జైన్ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడంతోపాటు, తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో 27నుంచి అన్ని శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండేలా విధులు కేటాయించి, తుపానుకు సంబంధించిన సమాచారాన్ని అన్ని జిల్లాలనుంచి ఎప్పటి కప్పుడు సేకరిస్తూ, నష్ట నివారణ దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేసింది.
తుపాను నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లో ప్రజలకు అండగాఉంటూ, సహాయక చర్యలు చేపట్టడానికి శిక్షణ పొందిన ఎస్ఆర్ఎఫ్, ఎన్ఆర్ఎఫ్ బలగాలను ప్రభుత్వం పంపించింది. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు తుపాను, వర్ష ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు అవసరమైన వసతి, సౌకర్యాలు కల్పించడానికి అన్ని జిల్లాలకు నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ముందస్తు ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ చర్యల్లో భాగంగా వరద ప్రాంత ప్రజల కోసం రాష్ట్రవ్యాప్తంగా 320 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, కేంద్రంలోని ప్రజలకు అల్పాహారం, భోజనం త్రాగునీరు, పాలు తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.
వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది. రాకపోకలకు, రవాణా సౌకర్యం ఎటువంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు రహదారులను క్లియర్ చేసే బృందాలను ఏర్పాటు చేసింది. విద్యుత్ అంతరాయాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్దరించే చర్యలు చేపట్టింది. ప్రజలకు నిత్యవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది. ఈవిధంగా ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ఎంతో అప్రమత్తతో ఉండటంవల్ల భారీస్థాయిలో తుఫాను ముప్పు నష్టాన్ని నివారించడమే కాకుండా ప్రాణ, పశు, ఆస్తి నష్టాలను సాధ్యమైనంతమేర నివారించగలిగింది. తుఫాను ముప్పు నష్టాన్ని భారీస్థాయిలో నివారించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటం ప్రభుత్వం ఘనవిజయంగా అభివర్ణించొచ్చు.













