అమరావతి (చైతన్యరథం): ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీ (పెస్ట్ అండ్ రోడెంటు కంట్రోల్ సర్వీసెస్) వారికి నోటీసులు జారీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్‌ను ఆదివారం మంత్రి ఆదేశించారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ స్పష్టంచేశారు. ఈ మేరకు డీఎంఈ వివరణ కోరుతూ సదరు ప్రైవేటు సంస్థకు షోకాజ్ నోటీసు జారీచేశారు. హాస్టల్ వార్డెనుకు వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. హాస్టల్లోని పరిస్థితులపై పరిశీలన చేయిస్తున్నామని డీఎంఈ రఘనందన్ తెలిపారు















