అమరావతి (చైతన్య రథం): వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మావిగన్ అజెండాతో 2029 ఎన్నికలకు వెళతామని చేసిన ప్రకటనతో ఈ రాష్ట్రానికి పట్టిన 11వ నెంబర్ దరిద్రం పోవడం ఖాయమని గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. 2019-24 మధ్య 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి.. 151 నుండి 11 సీట్లకు చతికిలపడినా తత్వం బోధపడలేదన్నారు. 2029లో తనకు అధికారం వస్తే మరోసారి రాష్ట్ర రాజధాని భవిష్యత్తుతో చెలగాటమాడతానని, రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తానని, ఇప్పటి వరకు రాజధానిలో జరిగిన పనులన్నింటినీ జేసీబీతో కుప్పకూల్చడం ఖాయమని జగన్ చెప్పకనే చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నో పవిత్రస్థలాల నుండి పవిత్ర జలాలు, మట్టితో శంకుస్థాపన చేసిన ఐదుకోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతితో చెలగాటమాడిన జగన్‌కు బుద్ధిచెప్పిన రాష్ట్ర ప్రజలు, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే 11 నుండి ఒకటికి పరిమితం చేయడం తధ్యమన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని అంటున్న జగన్మోహన్ రెడ్డికి.. అసలు రాజధాని పరిధి ఎక్కడివరకు విస్తరించి ఉందో కనీస అవగాహన లేదన్న విషయాన్ని తాజా ప్రకటనతో బయటపెట్టుకున్నాడని అన్నారు. ప్రస్తుతం రాజధాని పరిధి మచిలీపట్నం పార్లమెంటు, విజయవాడ పార్లమెంటు, గుంటూరు పార్లమెంటుల మధ్య కేంద్రీకృతమైంది. కనీసం ఈ విషయంపై జగన్‌కి అవగాహన లేకుండా మావిగన్ అని చెప్పడమంటే పూర్తిగా అవివేకంకాక మరొకటి కాదన్నారు. అమరావతికి చట్టబద్ధత లభించినా, గెజిట్ విడుదలైనప్పటికీ జగన్ అమరావతిని నాశనం చేయడమే పంతంగా పెట్టుకున్నాడని తేటతెల్లమైందని కొలుసు వ్యాఖ్యానించారు.
“మావిగన్ 2029 సార్వత్రిక ఎన్నికల వరకు కాదు, త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దెబ్బకే తుప్పుపట్టి విరిగిపోవడం ఖాయం. మాటతప్పడం, మడమను 360 డిగ్రీల కోణంలో తిప్పడం జగన్మోహన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. 2029 ఎన్నికలు వచ్చేనాటికి జగన్ మావిగన్ ప్రతిపాదనను మార్చేసి మరో ప్రతిపాదనతో రాష్ట్ర ప్రజలను పూర్తిగా పక్కదోవ పట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట అమరావతే రాజధాని అన్నాడు. తర్వాత మÖడు రాజధానులు అన్నాడు. నేడు మావిగన్ అంటున్నాడు. ఆ తర్వాత ఏ గన్ తెస్తారోనని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల కలల రాజధానికి కులాలను అంటగట్టి కుప్పకూల్చే కుతంత్రాలు చేయడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. దేవతల రాజధాని అమరావతి జోలికి ఎవరు వచ్చినా, చెడగొట్టాలని చూసినా ఫలితం అనుభవించక తప్పదు.
రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగడం చూసి జగన్‌కి నిద్రపట్టడం లేదు. 2029లో అధికారంలోకి వస్తామని, మావిగన్‌తో అమరావతిని కూల్చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం శోచనీయం. జగన్ అధికారంలోకి రావడం కాదు, ప్రస్తుతం ఉన్న 11 సీట్లు కుప్పకూలకుండా నిలబెట్టుకుంటే గొప్పే. జగన్మోహన్‌రెడ్డి పరిపాలన విధ్వంసపూరితమని, కూటమి ప్రభుత్వ పాలన వికాసంవైపు దూసుకెళుతోందని రాష్ట్ర ప్రజలు గ్రహించారు, నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా దెబ్బతీయలేడు” అని మంత్రి పార్థసారథి హెచ్చరించారు.















