- ఇంత అబద్దాలకోరు సిఎంను చరిత్రలో చూడలేదు!
- ముఖ్యమంత్రిగా కాదు… రాజకీయాలకే ఆయన అనర్హుడు
- హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు అనైతికం
- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
- పేరుమార్పు బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ కు వినతి
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒక చీకటి చట్టం తెచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ ఆర్ పేరు పెట్టడంపై చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో కలిసి గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదుచేశారు. అసంబద్దం,అనైతికమైన ఆ బిల్లు ను తిరస్కరించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ..ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీకి వైఎస్‌ఆర్ పేరు పెట్టాలని అత్యవసరంగా, హడావుడిగా చట్టాన్ని తెచ్చారు.రాష్ట్రచరిత్రలో తనకంటూ ప్రత్యేకముద్ర ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. అన్ని మెడికల్ కళాశాలలను ఒక యూనివ ర్సిటీ కిందకు తెస్తూ 1986లో హెల్త్ వర్సిటీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం 1998లో మేము ఎన్టీఆర్‌పేరు వర్సిటీకి పెట్టాం. వైద్య రంగంలో పెను మార్పులకు కారణమైన ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీకి పెట్టాం. డాక్టర్ కాకర్ల సుబ్బారావువంటి వారికి అమెరికా నుంచి తీసుకువచ్చి నిమ్స్‌ను అభివృద్ధిచేసిన చరిత్ర ఎన్టీఆర్‌ది. 24 ఏళ్లలో వేల మంది ఈ యూనివర్సిటీ అనుబంధ వైద్యకళాశాలల ద్వారా వైద్య విద్య అభ్యసించారు. నేను సిఎంగా ఉన్నప్పుడు తక్కు వ మెడికల్ కాలేజ్‌లు ఉన్నాయి. వాటిని పెంచాలని కేంద్రంతో సమన్వయం చేసుకున్నాం. రాష్ట్రంలో 32మెడికల్ కాలేజీలు ఉంటే 18టీడీపీ హయాంలోనే వచ్చాయి.13 ప్రైవేటు, 5 ప్రభుత్వ కాలేజీలు మా హయాంలో వచ్చాయి.
ఎయిమ్స్‌ను అభివృద్ధి చేసిందెవరు?
అసెంబ్లీలో ఇన్ని అసత్యాలు చెప్పిన సీఎంను నేను ఇంతవరకూ చూడలేదు. 8వ సారి నేను అసెంబ్లీలో ఉన్నాను. చట్టసభలో అబద్దాల కోరుగా సీఎం వ్యవహరించారు. మంత్రి అయినా ఎవరైనా సభకు ప్రిపేర్ అయ్యి.. బాద్యతగా చెపుతారు. రాజ్యాంగపై ప్రమాణం చేసి చట్ట సభలో కూర్చుంటాం. అలాంటి చట్ట సభలో కూర్చున్న సిఎం అబద్దాలు చెప్పారు. నేను కాలేజీలు పెట్టానో, లేదో చిన్నపిల్లలను అడిగినా చెపుతారు. జగన్ పాలనలో మూడున్నరేళ్లకు మూడు కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. వాటికి సంబంధించి కనీసం గోడలు కూడా పూర్తి చెయ్య లేదు. తాను రాష్ట్రానికి ఎయిమ్స్ తీసుకువస్తే కనీసం నీటి సరఫరా చెయ్యలేదు. ఎయిమ్స్‌కు 190 ఎకరాల భూమి ఇచ్చాం..అన్ని పనులు చేశాం. కానీ ఈ ప్రభుత్వం దానిపైనా అసత్యాలు చెబుతోంది. వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసెయ్యాలి అనే ఆలోచన, మనసు ఎలా వచ్చింది? పేరుమార్పుపై సిఎం ఎవరితో మాట్లా డారో.. ఏ ఆత్మతో మాట్లాడారో తెలీదు. ఎన్టీఆర్ కు వైఎస్సార్ తో పోలిక ఏంటి? ఏ అంశంలో ఎన్టీఆర్ తో రాజశేఖర్‌రెడ్డిని పోలుస్తారు. ఎన్టీఆర్ కంటే వైఎ స్సార్ గొప్ప అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. ఎన్టీఆర్ శతజయంతి సమయంలో వర్సిటీకి పేరు తీసేస్తారా? కొత్త మెడికల్ కాలేజీలు కట్టి మీ పేరు పెట్టుకోండి. మెడికల్ కౌన్సిల్ మీకు అనుమతి ఇచ్చిందా? వర్సిటీకి గవర్నర్ ఛాన్సలర్‌గా ఉన్నారు.. గవర్నర్‌ను అడిగారా? ఇది గవర్నర్‌కు అవమానం కాదా అని ప్రశ్నించారు. పేర్లు ఉన్నపళం గా మార్చ డం అనేది పిచ్చివాళ్ల పని. మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు పోరాటం కొనసాగిస్తాం.
షర్మిలకు ఏమని సమాధానం చెబుతావ్?
ఎన్టీఆర్ పేరు మార్చడం సరికాదని స్వయం గా నీ చెల్లెలు చెప్పింది. రక్తం పంచుకుని పుట్టిన నీ చెల్లెలు మీ తండ్రి పేరు పెడితే ఇది సబబు కాదు అని చెప్పింది. నువ్వు మనిషివైతే మారాలి. అసవరం అయితే కొత్త కాలేజీలు కట్టి, యూనివర్సిటీలు తెచ్చి పేరు పెట్టుకో. దీని వల్ల ఇమేజ్ పెరగదు. బిల్లును రిజక్ట్ చెయ్యమని గవర్నర్ ను కోరాం. అనైతికం, చట్ట వ్యతిరేకం అని గవర్నర్ కు తెలిపాం. 9 కోట్ల మంది తెలుగు వారిని అవమానం చేసినట్లు. బిల్లు తెచ్చిన విషయం తనకు తెలియదని గవర్నర్ తెలిపారు. చాన్స్ లర్ గా ఉన్న గవర్నర్ కు కూడా తెలియకుండా బిల్లు తెచ్చారు. కేంద్ర స్థాయిలో పోరాడుతాం..లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. ఒక్క సారిగా పేరు మార్పుతో బ్రాండ్, క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. జగన్ యూనివర్సిటీ నిధులు కూడా దోచేశారు..కనీసం స్నాతకోత్సవం జరుపు కోవడానికి కూడా నిధులు లేకుండా చేశారు. జగన్ చేసింది నీచాతినీచం, ఘోరమైన తప్పని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం
అంతకుముందు పార్టీ నేతలతో కలిసి టిడిపి అధినేత గవర్నర్‌తో 30 నిముషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టిన విధానం పై గవర్నర్ కు వివరించారు. హడావుడిగా, రాత్రికి రాత్రి క్యాబినెట్ ఆమోదం పొంది బిల్లు పెట్టారని తెలిపారు. అభ్యంతరం తెలిపిన తమ సభ్యులను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీలకు చాన్స్ లర్ గా ఉండే గవర్నర్ కు కూడా సమాచారం లేకుండా బిల్లు తెచ్చిన విధానాన్ని వివరించారు. సభలో వైసిపి సభ్యులు వాడుతున్న భాషపైనా చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా…వివిధ అంశాలపై గవర్నర్‌కు చంద్రబాబు వివరాలు తెలి పారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు, ప్రజలపై కేసులు పెడుతున్న విధానాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందని, ఇలాంటి పరిస్థితులలో రాజ్యాంగ పరమైన పోస్టులో ఉన్న గవర్నర్ కలుగజేసుకోవాలని కోరారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో, అనేక అంశాలపై తాము ఫిర్యాదులు చేసిన విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. అయితే బిల్లు తెచ్చిన విషయం కూడా తనకు తెలియదని గవర్నర్ టిడిపి నేతలతో చెప్పిన గవర్నర్… ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తానని చెప్పారు.