- ఇకపై చిన్నారులకు మరింత నాణ్యంగా మధ్యాహ్న భోజనం
- దీంతో పాఠశాలల్లో పెరగనున్న హాజరుశాతం
- మంత్రి లోకేష్‌కు సహచర మంత్రుల అభినందనలు
అమరావతి (చైతన్యరథం): విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనానికి ఇకనుంచి సన్నబియ్యం వినియోగించాలని నిర్ణయించారు. అమరావతి సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుతీరుపై ఆసక్తికర చర్చ సాగింది. ఇప్పటికే ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తెచ్చిన మార్పుల గురించి మంత్రి లోకేష్ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సన్నబియ్యం ప్రతిపాదనను తేగా, సహచర మంత్రులు బలపర్చారు. నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం ( ఫైన్ రైస్ ) అందిస్తే మరింత క్వాలిటీతో చిన్నారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని క్యాబినెట్ ముందు ప్రస్తావించారు.
ఇందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారం కావాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంటుందని, ఆ బియ్యం ఇవ్వడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రి నాదెండ్ల చెప్పారు. దీంతో ఇక నుండి నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం (ఫైన్ రైస్) తో మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సహచర మంత్రులు మంత్రి లోకేష్ ను అభినందిస్తూ…మీ చొరవతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదపిల్లలకు పౌష్టికాహారం అందుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న మంత్రి లోకేష్… చూపిన చొరవతో ఇకపై చిన్నారులకు మరింత నాణ్యమైన భోజనం అందనుంది.