- నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ.. అంటూ మంత్రి ఆత్మీయ పలకరింపు
- విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి
అమరావతి(చైతన్యరథం): విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లీ అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత.. వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో 14వ రోజు మంగళవారం ప్రజాదర్బార్ కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది ఆయాలు, పారిశుద్ధ్య కార్మికులను గత ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించిందని, ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఏపీజీసీఏఎస్ యూనియన్ ప్రతినిధులు.. నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, పాఠశాలల విలీనం వల్ల పని ఒత్తిడి పెరిగిందని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కనీసం వేతనం అమలుచేయడంతో పాటు అకారణంగా విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆయాలు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను విన్న మంత్రి లోకేష్… పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం మెల్లంపూడికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు..లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని మంగళగిరి హుడా కాలనీకి చెందిన షేక్ మౌలాలి కోరారు. దశాబ్దాలుగా పెండిరగ్‌లో ఉన్న తాడేపల్లి కిస్ట్నా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల జీతం బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేసీ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో తాగునీటి సరఫరాతో పాటు వీధి లైట్లు ఏర్పాటుచేయాలని ఆత్మకూరులోని సీతారామ అపార్ట్‌మెంట్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి, తక్షణమే కొత్త వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించాలని విశాఖకు చెందిన ఏపీ బీసీ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి జిల్లా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న తనను గత ప్రభుత్వం అకారణంగా తొలగించిందని, తిరిగి ఉద్యోగం కల్పించాలని ఎన్. మహేశ్వరి కోరారు. శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనకు మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేయాలని డీసీ ఉన్నూరు సాహెబ్ కోరారు. గుంతకల్లు నియోజకవర్గం కసాపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్‌కు మరమ్మతులు చేయించి 8 గ్రామాల ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని వై.జీవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని, అర్హత పత్రాలు మంజూరు చేయాలని, ఆర్‌ఎంపీ బోర్డు ఏర్పాటుచేయాలని ఆ సంఘాల ప్రతినిధులు.. నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.