- ప్రజలను పీక్కుతింటున్న ప్రజాప్రతినిధులు
- లంచం అడగటం నేరం, కానీ ఎమ్మెల్యేలు అడిగితే మాత్రం ధర్మం.. ఇదే వైసీపీ ప్రభుత్వ తీరు
- భూ వివాదంలో రూ 16 లక్షలు డిమాండ్ చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
అమరావతి: ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే రాబందుల్లా ప్రజలను పీక్కుతినటం మన రాష్ట్రంలోనే చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎమ్మెల్యేలు తమ విధులను మరిచిపోయారు.. రాష్ట్రంలోని భూములను గద్దల్లా ఎగరేసుకుపోతున్నారని శనివారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ‘‘లంచం అడగటం నేరం.. కానీ ఎమ్మెల్యేలు అడిగితే ధర్మం’’ .. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద శనివారం జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. తమ గోడును సీఎంకు మొరపెట్టుకునేందుకు రాష్ట్ర ప్రజలకు హక్కు లేదు. భూ వివాద పరిష్కారానికై నరసరావుపేటకు చెందిన కుటుంబం స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని కలువగా అతను రూ.16 లక్షలు డిమాండ్ చేశారంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఎమ్మెల్యే వేధింపులకు తట్టుకోలేక సీఎంకు చెప్పుకునేందుకు వచ్చిన తమకు న్యాయం జరగదని ఆందోళన చెందిన ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయటం తీవ్రంగా కలిచివేసింది. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేగా అనర్హుడు. వెంటనే అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేసి వేధింపుల నుండి ఆ కుటుంబాన్ని రక్షించి రాజ్యాంగాన్ని కాపాడాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.