- రైతులు నమ్మి భూములు అప్పగిస్తే మీరు చేసేది ఇదా?
- ఎన్‌సీఎల్‌టీలో ప్రభుత్వ వాదనలు ఎందుకు బలంగా విన్పించలేదు
- లేపాక్షి భూములకు టీడీపీ కాపలాగా నిలుస్తుంది
- భూములను ఎవరికీ అప్పనంగా పోనివ్వం
- పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల
అనంతపురం: లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో సుమారు 10వేల ఎకరాలను ఆనాటి వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి ప్రభుత్వం స్వీకరించిందని, రైతులకు ఎకరాకు కేవలం రూ.2లక్షల చొప్పున ఇచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకుందని పీఏసీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఇందూ గ్రూపుకు చెందిన రూ.వేలకోట్ల విలువైన భూములు దివాలా ప్రక్రియ పేరుతో సీఎం జగన్ దగ్గరి బంధువుల కంపెనీకి దక్కుతున్న నేపథ్యంలో ఆ వ్యవహారంపై పయ్యావుల స్పందించారు. అనంతపురం జిల్లా టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ హయోంలో లక్షల సంఖ్యలో పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని నాటి ప్రభుత్వం చెబితే ప్రజలు ఆశపడ్డారని తెలిపారు. ‘‘ప్రజల భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదనేదే మా ఉద్దేశం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజల భూములను కాపాడతారా.. మీ బంధువుల తరఫున నిలబడతారా? అనేది సీఎం జగనే చెప్పాలి. ఆ భూములకు టీడీపీ కాపలాగా ఉంటుంది తప్ప ఎవరికీ అప్పనంగా పోనివ్వం.
నేను విషయాన్ని బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయట్లేదు? ఆ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. రాంకీ, అరబిందో సంస్థలు మీ భాగస్వామ్య సంస్థలు కాదా? భూములను మళ్లీ ప్రజలకు అప్పగించేందుకు వైసీపీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలోనైనా ఆ భూములపై మాట్లాడతారా? ఎన్‌సీఎల్‌టీలో ప్రభుత్వ వాదనలు ఎందుకు వినిపించలేకపోతున్నారు? రూ.10వేల కోట్ల విలువైన భూములను రూ.500 కోట్లకే కట్టబెడతారా?’’ అని పయ్యావుల కేశవ్ నిలదీశారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కుంభకోణం నేపథ్యమిదీ :
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు అనం తపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌హబ్ పేరుతో కారుచౌకగా అత్యంత విలువైన భూములను కట్టబెట్టారు. అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న రూ.4,500 కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా కేవలం రూ.500 కోట్లకే దక్కనున్నాయి.