- మహాపాదయాత్రలో కదంతొక్కిన రాజధాని రైతులు
- అమరావతి టు అరసవిల్లి యాత్రకు శ్రీకారం
- అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు
- పూలుచల్లుతూ, హారతులిస్తూ ఘనస్వాగతం
- ఉద్యమకారులకు ప్రధాన రాజకీయపక్షాల సంఫీుభావం
అమరావతి : భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సాగుతున్న అమరావతి రైతుల ఉద్యమం వెయ్యిరోజులు పూర్తయ్యాక సరికొత్త మలుపు తీసుకుంది. అమరావతి నుంచి అరసవెల్లి మహాపాదయాత్ర జయహో అమ రావతి అంటూ ఉద్యమకారుల రణన్నినాదాల మధ్య సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. న్యాయ స్థానం నుంచి దేవస్థానం పేరుతో తొలివిడతలో అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికీ విజయవంతం గా పూర్తిచేసి అమరావతి రైతులు ప్రజలకు తమ గళాన్ని విన్పించారు. అమరావతి రైతుల మహోద్య మం 1000రోజులు అయిన సందర్బంగా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు జేఎసి సముక్తంగా నిర్వహిస్తున్న అమరావతి టు అరసవెల్లి మహాపాదయాత్ర సోమవారం ఉదయం వెంకటాపాలెంలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వరుని దేవస్ధానం నుంచి ప్రారంభమైంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వందలాది మంది రైతులు.. రాష్ట్రం నలుమూలాల నుంచి వచ్చిన మద్దతుదారులు వెంటరాగా పాదయాత్ర ప్రారంభించారు. ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు, అమరావతి జేఎసీ నేతలు పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిర్మించిన శ్రీ ఏడు కొండల వెంకటేశ్వరుని ఏడు గుర్రాల రథంతో వెంకటపాలెం చేరుకున్నారు. యాత్ర ప్రారంభంలో పాదయాత్ర బృందానికి వెంకటపాలెం ప్రజలు బ్రహ్మరధం పట్టారు. పాదయాత్ర రథానికి 101 గుమ్మడికాయలు కొట్టి యాత్రకు శ్రీకారం చుట్టారు రాజధాని ప్రాంత మహిళలు. పాదయాత్ర వెంకటపాలెం నుండి మొదలై కృష్ణాయపాలెం, పెనుమాక, యర్రబాలెం మీదుగా రాత్రికి మంగళగిరి చేరుకుంది. యాత్రకు దారి పొడవునా రాజధాని ప్రాంతల రైతులు ఘనస్వాగతం పలు కుతూ హారతులలిచ్చారు. పూలతివాచీపై పాదయాత్ర చేస్తున్న రైతులను నడిపించి వారిలో స్పూర్తి నింపారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం యాత్ర మార్మోగింది. రాష్ట్రాభివృద్దిలో అమరావతి ఒక చారిత్రక కట్టడంగా నిలిచిపోతుందని, ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటోందని అమరావతి రైతులు ఆరోపించారు.
మూడు రాజధానుల పేరుతో ఐకమత్యంగా ఉన్న రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు చేస్తున్న శాంతియుత యాత్రను రాష్ట్రమంత్రు లు దండయాత్రగా మాట్లాడడం, యాత్రపై విషప్రచా రం చేయడం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని అవశ్యకతను తెలియజేయడం, రాజధాని ప్రాంత రైతుల కష్టాన్ని వివరించడమే ప్రధానోద్దేశంగా యాత్ర జరుగుతుందని అమరావతి పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. యాత్ర ప్రారంభం సంద ర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు రైతులకు మద్దతుగా నిలచి పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రా నికి దిక్సూచిగా నిలిచి రాజధాని కోసం పోరాడుతున్న అమరావతి ప్రాంత రైతులకు నేతలు తమ సంఫీు భావాన్ని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, ఎపిసిసి వర్కింగ్ ప్రెసి డెంట్ తులసిరెడ్డి, బిజెపి నేతలు కామినేని శ్రీనివాస్, పాతూరి నాగభూషణం, తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఎంపీ మాగంటి బాబు, టిడిసి నేతలు చింతమనేని ప్రభాకర్, గద్దే అనురాధ, తంగిరాల సౌమ్య, ఎమ్మేల్సీ అశోక్ బాబు, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర నాయకు లు ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, నాయకులు బాబూరావు, పాటు ప్రత్యేక హోదా సాధనసమితి నాయకులు చలసాని శ్రీనివాసారావు, వివిధ ప్రజాసంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.