- జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730, అమలు చేసింది కేవలం 109, అంటే 15శాతం మాత్రమే
- 99.5 శాతం హామీలు అమలుచేశానని చెప్పుకోవడం నిలువెత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లింది
- 85 శాతం హామీలు విస్మరించి ప్రజల్ని వంచించడమేనా జగన్ రెడ్డి నీతి, నిజాయితీ, నిబద్ధత?
- జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చాం
- జగన్ రెడ్డి మోసాలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియచేస్తాం
- త్వరలోనే పార్లమెంట్ల వారీగా భారీ బహిరంగసభలు నిర్వహించి జగన్ రెడ్డి వంచనను ప్రజలకు వివరిస్తాం
- సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ప్రచారం చేసిన జగన్ రెడ్డి హామీలన్నీ జనం ముందు ఉంచుతాం
- తన మేనిఫెస్టో బైబిల్ తో సమానమని చెప్పుకునే జగన్ రెడ్డి.. మేనిఫెస్టోలోని అంశాలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే
- మాటమీద నిలబడకుంటే పదవికి రాజీనామా చేయాలని గతంలో జగన్ రెడ్డే ప్రగల్భాలు పలికారు
- ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయనందుకు లెంపలేసుకొని, తప్పుఒప్పుకొని తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి
- నవరత్నాలు + మేనిఫెస్టో + జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ పుస్తకాన్ని పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు
అమరావతి: హామీల అమలుకు సంబంధించి జగన్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పచ్చి అబద్ధాలకోరు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730 అయితే, అమలుచేసింది కేవలం 109 అంటే 15 శాతం మాత్రమేనన్నారు. 99.5 శాతం హామీలు అమలుచేశానని చెప్పుకోవడం నిలువెత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ప్రతిపక్షనేతగా గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారం లోకి రాకముందు ఎన్ని హామీలు ఇచ్చి, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని నెరవేర్చాడో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘నవరత్నాలు G మేనిఫెస్టో G జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే 150 పేజీల పుస్తకాన్ని గురువారం పార్టీ నేతలతో కలిసి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీ.డీ.జనార్థన్, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధారునాయక్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ తన మేనిఫెస్టో తనకు బైబిల్ అని, తూచా తప్పకుండా దానిలోని ప్రతి హామీని అమలుచేశానని, 99.5 శాతం హామీలు పూర్తిచేశానని జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, టీడీపీ మేనిఫెస్టోను కూడా వెబ్ సైట్ లో లేకుండా తొలగించాడని జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం పదేపదే దుష్ప్రచారం చేసింది. జగన్ రెడ్డి మాటలకు.. చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలకు తెలియచేయడానికే నేడు టీడీపీ తరుపున ‘నవరత్నాలు G మేనిఫెస్టో G జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ పుస్తకాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో చూస్తే టీడీపీ మేనిఫెస్టో స్పష్టంగా కనిపిస్తుంది
2014-19 టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉంచకుండా తీసేశారని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు ఒక్కసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూస్తే దానిలో చంద్రబాబు నాయుడి మేనిఫెస్టో అద్దంలా కనిపిస్తుంది. ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను చంద్రబాబు 99 శాతం పూర్తిచేశాడనే నిజం కూడా అది చూసిన వారికి బోధపడుతుంది. పాదయాత్రలో గానీ, ఎన్నికల సమయంలో గానీ, ఇతరత్రా వివిధ సందర్భాల్లో జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మొత్తం హామీలు 730. ఆ హామీలన్నింటినీ ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఇచ్చాడనే పూర్తి వివరాల్ని కూడా 150 పేజీల ఈ పుస్తకంలో తెలియచేశాం. అలానే జగన్ రెడ్డి ప్రజలముందు చేతులూపుతూ చెప్పిన మాటల్ని కూడా దృశ్యరూపంలో (వీడియోలు) ప్రజల ముందు ఉంచుతున్నాం. అధికారం చేపట్టిన ఈ 4 ఏళ్ల 8 నెలల్లో జగన్ రెడ్డి ఎన్ని హామీలు నెరవేర్చాడో ప్రజలకు నిజం చెప్పాలి. 99.5 శాతం హామీలు నెరవేర్చానని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 730 హామీల్లో జగన్ రెడ్డి కేవలం 109 మాత్రమే అమలుచేశాడు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 85శాతం ఎగ్గొట్టి, సిగ్గులేకుండా ఇంతగా బరితెగించి అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికే చెల్లింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే, దానిలో రూ.3లక్షల కోట్లను కేవలం సంక్షేమానికే ఖర్చుపెట్టింది. ప్రతి పైసా ఎక్కడ ఎవరికి ఖర్చుపెట్టామనే వివరాల్ని కూడా ఈ పుస్తకం లో పొందుపరిచాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.10లక్షల కోట్ల అప్పులు చేశాడు. నాలుగేళ్లలో పేదల రక్తం పీల్చి దాదాపు రూ.2లక్షల కోట్లు వివిధ రూపాల్లో వసూలుచేశాడు. మొత్తంగా రూ.12 లక్షల కోట్లలో బటన్ నొక్కుడు ద్వారా జగన్ రెడ్డి ప్రజలకు అందించిన సొమ్ము కేవలం రూ.2.40 లక్షల కోట్లు. మరి మిగిలిన సొమ్ము ఎటుపోయిందని ముఖ్యమంత్రిని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
జగన్ రెడ్డి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించి, ఒక్క ఎకరాకు నీరిచ్చాడా
4 ఏళ్ల 8 నెలల పాలనలో జగన్ రెడ్డి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా నిర్మించాడా ? టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ఒక్క ప్రాజెక్ట్ ను అయినా పూర్తి చేసి, ఒక్క ఎకరాకు అయినా నీళ్లిచ్చాడా? ఉన్న ప్రాజెక్టుల్ని కూడా సమర్థవంతంగా నిర్వహించలేక, ఆఖరికి గేట్లకు గ్రీజు కూడా పెట్టలేక వరద తాకిడికి అవి కొట్టుకు పోయేట్టు చేశాడు. అన్నమయ్య ప్రాజెక్ట్, గుండ్లకమ్మ, పింఛా, పులిచింతల ప్రాజెక్టుల్ని ఏం చేశాడో అందరం చూశాం. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను 72 శాతం పూర్తిచేసింది. చంద్రబాబు నాయకత్వంలో పోలవరం పనులు శరవేగంగా జరిగాయి. అన్ని వర్గాల ప్రజల కోసం ఆనాడు చంద్రబాబు ఎన్నో పథకాలు అమలు చేశారు. వాటన్నింటినీ అధికారంలోకి వచ్చీ రావడంతోనే జగన్ రెడ్డి రద్దుచేశాడు. మొత్తంగా 120కి పైగా పథకాలు రద్దుచేసి, పేదల ద్రోహిగా మిగిలాడు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్ ప్లాన్ నిధుల్ని కూడా జగన్ రెడ్డి దారి మళ్లించాడు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేసి, బలహీనవర్గాల నోట్లో మట్టికొట్టాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబునాయుడు ఒక్క ఉద్యోగం ఇవ్వడం లేదని ప్రతి విద్యాసంస్థకు వెళ్లి, యువత…నిరుద్యోగుల మనసుల్లో విషబీజాలు నాటాడు. తన గెలుపుకు సహకరిస్తే, తాను ముఖ్యమంత్రి అయితే ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని, డీఎస్సీ నిర్వహిస్తానని, ప్రత్యేక హోదా తెచ్చి పరిశ్రమలు తీసుకొస్తానని నమ్మబలికాడు. విద్యుత్ ఛార్జీలు పెంచనని, రైతులకు, వ్యాపార వర్గాలకు, పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ సమయాన్ని ఇంకా పెంచుతానని మాయమాటలు చెప్పాడు. కానీ ఈ 4 ఏళ్ల 8నెలల్లో ప్రజలపై రూ.64వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపాడని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
మద్యాన్ని నిషేధించాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్నాడు…
మద్యాన్ని నిషేధిస్తానని మహిళలకు జగన్ మాయమాటలు చెప్పాడు. మద్యాన్ని నిషేధించాకే 2024 ఎన్నికల్లో మరలా ఓట్లు అడుగుతానని కూడా ప్రగల్భాలు పలికాడు. కానీ వాస్తవంలో ఏం చేశాడయ్యా అంటే..కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ, మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25వేల కోట్ల అప్పు తెచ్చాడు. పేదల ఇళ్లను ఒక్క రూపాయికే వారికే రిజిస్ట్రేషన్ చేసి, ఇళ్లపై వారికి శాశ్వతహక్కులు కల్పిస్తానన్న జగన్ రెడ్డి, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకు కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో ఒక్కో ఇంటికి రూ.10వేలు, రూ.20వేల చొప్పున వసూలుచేసి ప్రజలసొమ్ము తినేశాడని అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం వాస్తవమే
అన్నింటికంటే ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి గొంతుకోశాడు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశాడు. వారికి కౌలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. జగన్ రెడ్డిని నమ్మి ఎగిరెగిరి పనిచేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని కూడా దారుణంగా వంచించాడు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి, చివరకు సాధ్యం కాదని నాలుక మడతేశాడు. చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తే దాన్ని తప్పుపట్టి, నూతన ఇసుక పాలసీ పేరుతో లక్షలకోట్ల ఇసుక అమ్ముకొని వేలకోట్లు కొట్టేశాడు. 125 కు పైగా వివిధ వృత్తుల వారికి ఉపాధి లేకుండా చేసి వారి ఆకలిచావులకు కారణమయ్యాడు. అంగన్‌వాడీ సిబ్బంది, ఆశావర్కర్ల జీతాలు పెంచుతాన న్నాడు. చివరకు ఇప్పుడు వాళ్లు రోడ్డెక్కితే తప్పుడు కేసులతో వేధిస్తున్నాడు. మున్సిపల్ సిబ్బందికి టీడీపీ ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అందిస్తే, అది చాలదని, తాను అధికారంలోకి వస్తే వారికి రూ25వేల జీతమిస్తానని నమ్మించాడు. చివరకు ఇప్పుడు వారిని పోలీసుల సాయంతో ఉక్కుపాదంతో అణచివేస్తున్నాడు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, వివిధ విభాగాల ఉద్యోగులు అందరూ జగన్ రెడ్డి మోసాలకు బలైన వారే. ఈ విధంగా 4 ఏళ్ల 8 నెలల పాలనలో జగన్ రెడ్డి తన మాటలు.. చేష్టలతో ప్రజల్ని, మొత్తంగా రాష్ట్రాన్నే నిలువునా ముంచేశాడు. టీడీపీ నేడు విడుదలచేసిన ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం వాస్తవమే. ఎన్నికలు వస్తున్నాయనో, టీడీపీని ఆదరించాలనో మేము ఈ పుస్తకం ప్రజలముందు ఉంచడంలేదు. జగన్ రెడ్డి అబద్ధాలు, మోసాలు ప్రజలు గ్రహించి జాగ్రత్తపడాలన్నదే మా ఆలోచన. జగన్ రెడ్డి అవినీతి పుత్రిక సాక్షి దినపత్రికలో ప్రచురితమైన జగన్ రెడ్డి హామీల కథనాల్ని కూడా అవసరమైతే మరో పుస్తకం రూపంలో ప్రజలముందు ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు చెప్పారు.
పింఛన్ దారులు ఈ నాలుగేళ్లలో నష్టపోయిన సొమ్మును వారికి తిరిగివ్వాలి
ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఒక్క నిమిషం కూడా పదవుల్లో కొనసాగే అర్హత ఎవరికీ లేదని వెంటనే రాజీనామా చేయాలని గతంలో జగన్ రెడ్డే అన్నాడు. మరి ఇన్ని హామీలిచ్చి ఏవీ నెరవేర్చని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నాడో, ఎలా కొనసాగుతాడో ఆయనే చెప్పాలి. తానిచ్చిన మాటకు కట్టుబడి, తప్పుచేశానని ఒప్పుకొని, ప్రజలముందు లెంపలేసుకొని తక్షణమే జగన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 100 శాతం హామీల్లో 85 శాతం అమలు చేయని వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని ప్రజల తరుపున ప్రశ్నిస్తున్నాం. (ఈ సందర్భంగా గతంలో జగన్ రెడ్డి ప్రజల సాక్షిగా మాట్లాడిన మాటల వీడియోను అచ్చెన్నాయుడు విలేకరులకు చూపించారు). అధికారంలోకి వచ్చాక తొలి సంతకం సామాజిక పింఛన్ల ఫైల్ పై చేసిన జగన్ రెడ్డి వెంటనే రూ.3వేల పింఛన్ ఇస్తానన్నాడు. కానీ మాట తప్పి, ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ వచ్చాడు. అధికారంలోకి రాగానే రూ.3 వేలు ఇస్తానని చెప్పిన వ్యక్తి, చివరి మూడునెలల్లో రూ.3వేలు ఇవ్వడం మోసం చేయడం కాదా? రేపు జనవరి నుంచి రూ.3 వేలు ఇస్తామంటున్నాడు. ఇన్నేళ్లలో జగన్ రెడ్డిని నమ్మి నష్టపోయిన పింఛన్‌దారులకు వారు నష్టపోయిన సొమ్ముమొత్తం తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ ఉంటే పింఛన్‌దారులు ఈ నాలుగేళ్లలో నష్టపోయిన సొమ్ము పైసలతో సహా తక్షణమే వారికి తిరిగివ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
మహిళలకు ఉచిత బస్సుప్రయాణం అంటుంటే నవ్వొస్తోంది
సూపర్ సిక్స్ లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటిస్తే, ఆ హామీని తానే అమలుచేస్తానని జగన్ రెడ్డి అంటున్నాడు. నాలుగున్నరేళ్లలో ఆర్టీసీ వ్యవస్థను సర్వనాశనం చేసి, బస్సులు రోడ్లపైకి వస్తేనే నిలిచిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, ప్రతి సంవత్సరం సంస్థ ఆదాయాన్ని తాను తీసుకుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఏటా రూ.250 కోట్లు కొత్త బస్సులు కొనడానికి ఆర్టీసీ సంస్థకు చెల్లించాం. ఆనాడు రవాణాశాఖ మంత్రిగా నేనే ఉన్నాను. జగన్ రెడ్డి వచ్చాక ఈ నాలుగేళ్లలో నాలుగు కొత్త బస్సులు అయినా కొన్నాడా? తలకిందులుగా తపస్సు చేసినా జగన్ రెడ్డిని ప్రజలు నమ్మరు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా భారీ సమావేశాలు పెట్టి, జగన్ రెడ్డి హామీల్లోని డొల్లతనం ప్రజలకు తెలియచేస్తాం. అలానే కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి వాస్తవాలతో కూడిన సమాచారం అందిస్తాం. జనవరి 5 నుంచి 29 వరకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేనల ఆధ్వర్యంలో భారీ సమావేశాలు పెట్టాలని నిర్ణయించాం. త్వరలోనే పూర్తి సమాచారం ప్రజలకు, మీడియా వారికి తెలియచేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
అధికారం కోసం అవాస్తవాలు, ముఖ్యమంత్రి అయ్యాక కక్షసాధింపులు, దోపిడీలు: బొండా
అధికారంకోసం జగన్ రెడ్డి ప్రజలకు చెప్పిన అవాస్తవాలకు ప్రతిరూపమే టీడీపీ విడుదల చేసిన ఈ పుస్తకమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అలానే సాక్షి టీవీలో ప్రసారమైన జగన్ రెడ్డి హామీల తాలూకా వీడియో క్లిప్లింగ్స్ ను కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చాం. మరో 3 నెలల్లో జగన్ రెడ్డి ఇంటికెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో మోసకారి జగన్ రెడ్డి మాటలు, హామీలు ప్రజలకు గుర్తుచేయడానికే టీడీపీ ఈ పుస్తకాన్ని విడుదలచేసింది. కేవలం అధికారం కోసమే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇవ్వనన్ని హామీలు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చాడు. అధికారం చేతికందగానే కక్షసాధింపులు, దోపిడీయే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడి, విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన భూములు కొట్టేశాడు. జాబ్ క్యాలెండర్, ప్రత్యేకహోదా పేరుతో యువత, నిరుద్యోగుల్ని వంచించాడు. చివరకు అవినీతి, దోపిడీతో పారిశ్రామిక వేత్తల్ని భయపెట్టి, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేట్టు చేశాడు. ఇసుక దోపిడీతో భవన నిర్మాణ కార్మికులు సహా, వివిధ రంగాల కార్మికుల పొట్టకొట్టాడు. ఇంత మోసకారి ముఖ్యమంత్రి భారతదేశంలో మరెవరూ ఉండరు. జగన్ రెడ్డి మోసాలు, అబద్ధాలు ప్రజలకు తెలియచేసి, అతనిచ్చిన హామీలను జనం ముందు ఉంచి, అతని బాగోతం బట్టబయలు చేస్తామని బొండా స్పష్టం చేశారు.
కల్తీ మద్యంతో 30 లక్షల మంది పేదల్ని ఆసుపత్రుల పాలుచేశాడు : వర్ల రామయ్య
మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలు చేశాకే ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నది నిజం కాదా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. అలా చెప్పిన వ్యక్తి ఈ 4 ఏళ్ల 8 నెలల్లో మద్యపాన సేవనాన్ని విపరీతంగా పెంచాడు. తన ధనదాహంతో మహిళల పుస్తెలు తెంచాడు. చివరకు జగన్ రెడ్డి నిర్వాకంతో తాగుబోతులు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.2.50 లక్షల కోట్ల విలువైన కల్తీమద్యాన్ని జగన్ రెడ్డి విక్రయించారు. కేవలం ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఉబలాటం తప్ప, జగన్ రెడ్డికి ప్రజల యోగక్షేమాలు, బాధలు పట్టవని అర్థమైంది. జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీమద్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇంత చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతారు? జగన్ రెడ్డి మేనిఫెస్టో అంతా పచ్చి బూటకం.. అబద్ధాల పుట్ట. ఇక ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని రామయ్య తేల్చి చెప్పారు.
జగన్ రెడ్డి ఎంత మోసకారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి : టీడీ.జనార్థన్
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఈ పుస్తకంలో జగన్ రెడ్డి హామీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే పొందుపరిచామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్థన్ చెప్పారు. నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కలిపి 102 సభలు పెట్టి జగన్ రెడ్డి చెప్పిన అంశాలు, వివిధ సందర్భాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే జనంలో ఎండగడతాం. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ జగన్ రెడ్డి ఎంత మోసకారో తెలుసుకోవాలని జనార్థన్ సూచించారు.