- సొంత ఆస్తుల రక్షణపైనే శ్రద్ధ
- తహసీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం
- రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం
- వైసీపీ నేతల అవినీతికి అడ్డుతగిలిన అధికారులపై వేధింపులు, దాడులు
- హోంమంత్రి ఎవరో ఎమ్మెల్యేలకే తెలియదు
- మండిపడ్డ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
అమరావతి: సీఎం జగన్ రెడ్డికి తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై లేకపోవటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖ నగర శివారు కొమ్మాదిలో తహశీల్దార్ రమణయ్య హత్య అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. మండల మేజిస్టేట్ నే ఇంట్లోకి వెళ్లి హత్య చేశారంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలయమైన ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంసృతి లేదని శనివారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరిపై దాడులు జరుగుతాయో, ఎప్పుడు ఎవరు హత్యకు గురవుతారోనని ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు, నేరాలు జరుగుతుంటే హోమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు హోమంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి తెలియదు. వైసీపీ వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం అమలవుతోంది. గత ఐదేళ్ల నుంచి విశాఖను భూకజ్జాలు, కమీషన్లు, సెటిల్ మెంట్లకు అడ్డాగా మార్చారు. ప్రజల ఆస్తుల విధ్వంసం.. ప్రజలు, అధికారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, శిరోముండనాలు వైసీపీ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. చట్ట ప్రకారం పనిచేస్తూ వైసీపీ నేతల అవినీతి, అరాచకాలకు అడ్డుతగిలిన అధికారులపై వేధింపులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అవి పరాకాష్టకు చేరి తహసీల్దార్ రమణయ్యను హత్య చేశారు, గతంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మార్వో లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ నేత చెంచు రెడ్డి ఎమ్మార్వో ఆఫీసులోనే బహిరంగంగా దాడి చేశాడు. మంత్రుల నుంచి వాలంటీర్ల వరకు అధికారులపై దాడులు, బూతులతో విరుచుకుపడుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అవినీతికి సహకరించలేదన్న కారణంతో దళిత కలెక్టర్ గంధం చంద్రుడిపై దౌర్జన్యం చేయటమేకాక, బదిలీ చేయించాడు. గుడివాడలో భూకబ్జాను అడ్డుకున్న వీఆర్వోను జేసీబీతో తొక్కి చంపేందుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు యత్నించారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డ్డి ఒక సమావేశంలోనే శాప్ అధికారులనుద్దేశించి అహంకారపూరితంగా ఇష్టమెచ్చినట్టు మాట్లాడి వారిని అగౌరవపరిచారు. కార్ పార్కింగ్ విషయంలో పోలీసులను మాజీ మంత్రి పేర్నినాని బండబూతులు తిట్టాడు. ప్రకాశం జిల్లాలో విద్యుత్ ఉద్యోగిపై వైసీపీ నాయకులు బహిరంగంగా దాడి చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, వాలంటీర్ల దాడులు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, ప్రతిపక్ష నేతలను వేధించడానికే పోలీసుల్ని జగన్ రెడ్డి ఉపయోగిస్తున్నారు తప్ప శాంతి భధ్రతల రక్షణ కోసం కాదు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ చేపట్టి దోషుల్ని శిక్షించాలి. ప్రభుత్వ అధికారులను అడుగుడుగునా వేధిస్తున్న వైసీపీ సర్కార్ ను సాగనంపేందుకు అధికారులు, ప్రజలు సిద్దంగా ఉన్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.