- నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌ను మభ్యపెట్టే ప్రయత్నం
- తద్వారా పార్టీని రక్షించుకోవాలనే తాపత్రయం
- అబద్ధాలు వల్లె వేయడాన్ని అలవాటుగా మార్చుకున్న జగన్‌రెడ్డి
- వైసీపీ అధ్యక్షుడిని నమ్మని ఏపీ ప్రజలు
అమరావతి,చైతన్యరథం: ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన దిమ్మతిరిగే ఫలితాలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకున్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలను వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితేనే న్యాయం జరుగుతుందంటూ ఒక ఉపదేశం ఇచ్చారు. ఇదే జగన్‌రెడ్డి 2019లో ఈవీఎంల ద్వారానే గెలిచారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఈవీఎంల విశ్వసనీయతను ఎవ్వరూ ప్రశ్నించకూడదని సెలవిచ్చారు. ఈవీఎంలపై నొక్కిన ప్రతి ఓటు కచ్చితంగా వేసిన పార్టీకే వెళ్తుందని, అందుకు వీవీప్యాట్లే సాక్ష్యాలని మీడియా మైకుల ముందు గొంతు చించుకొని మరీ చెప్పారు. కానీ ఐదేళ్ల తర్వాత అదే జగన్‌రెడ్డి మాట మార్చారు. మాట మార్చను..మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకునే జగన్‌రెడ్డి మరోసారి మాట తప్పారు. ఇంతకంటే దిగజారడానికి ఇంకేమీ లేదని అనుకున్నప్పుడల్లా మరింత దిగజారిపోయినట్లుగా జగన్‌రెడ్డి వ్యవహరించారు. మాట మార్చడం జగన్‌రెడ్డికి కొత్తేంకాదు. అమరావతి రాజధాని విషయంలోనూ అదే చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్‌రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. అయితే జగన్‌రెడ్డి యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు?
ఎన్నికలకు ముందే ఓటమి సంకేతాలు
తన ఐదేళ్ల ప్రజా వ్యతిరేక పాలన వల్ల ఎన్నికల్లో ఓటమి ఖాయమని జగన్‌రెడ్డికి ముందే అవగతమైంది. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోకుండా, వీరిద్దరూ కలిసి ఎన్డీయే లో భాగాస్వాములు కాకుండా అడ్డుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో ఎన్నికల్లో తామే గెలుస్తామంటూ ఊరుపేరు లేని సంస్థలతో తప్పుడు సర్వేలు చేయించి తన బ్లూ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలని చూశారు. అయినప్పటికీ ప్రజలు వాటిని నమ్మలేదు. చివరి ప్రయత్నంగా ఎన్నికల్లో హింసను ప్రేరేపించి ప్రజలను భయభ్రంతులకు గురిచేసి తనకు అనుకూలంగా ఓటింగ్ చేయించుకొని బొటాబోటి మెజార్టీతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కుట్ర చేశారు. అయితే కొంత ఎన్నికల సంఘం చర్యలకు తోడు, అంతకు మించి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ ప్రాణాలకు తెగించి ఓటింగ్ సక్రమంగా జరిగేలా చూశారు. ప్రజలు కూడా పూర్తి చైతన్యంతో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గొడవలు సృష్టించినా వాటిని పట్టించుకోకుండా వచ్చి ఓటు వేశారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి ఎన్నికల సమయానికే చాలా చోట్ల వైసీపీ కేడర్ డీలా పడిపోయింది. అందువల్లే జగన్‌రెడ్డి ఆశించినంతగా అత్యధిక నియోజకవర్గాల్లో హింసను ప్రేరేపించలేకపోయారు. ఐదేళ్ల అరాచక ప్రభుత్వాన్ని పంటి బిగువున భరించిన ప్రజలు ఉప్పెనలా కదలి ఓటు వేశారు. దేశంలోనే అత్యధిక పోలింగ్ ఏపీలో నమోదైంది. పోలింగ్ జరిగిన తీరును బట్టి టీడీపీ కూటమిదే విజయమని ఖాయమైపోయింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించబోతోందని ప్రశాంత్ కిశోర్, యోగేంద్ర యాదవ్ లాంటి ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు అందరూ చెప్పారు. జగన్‌రెడ్డికి కూడా అది అర్ధమయిపోయింది.
వైసీపీ కేడర్‌లో నైరాశ్యం
ఎన్నికల సమయానికే డీలా పడిపోయిన పార్టీ కేడర్…ఘోరమైన ఫలితాలు వస్తే ఎంత నైరాశ్యంలోకి వెళతారనే భయం జగన్‌కు పట్టుకుంది. పోలింగ్ పూర్తయిన నాలుగు రోజుల పాటు వైసీపీ క్యాంప్‌లో కదలిక లేదు. వైసీపీ కేడర్‌లో ఉత్సాహం లేదు. ఓటమి ఖాయమనే భావనలోకి వెళ్లిపోయారు. కేడర్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు వైసీపీ అధిష్టానం..ముఖ్యంగా జగన్‌పై ఉన్నాయి. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో సమాంతర వ్యవస్థను నిర్మించుకొని జగన్..ఆయన చుట్టూ ఉన్న కొద్దిమంది నేతలు వేల కోట్ల రూపాయలు దండుకున్నారే తప్ప పార్టీ కేడర్‌ను పట్టించుకోలేదని, వారికి విలువ ఇవ్వలేదనే కోపం వారిలో ఉంది. దానికి తోడు పార్టీ కూడా ఓడిపోతుండడంతో వారిలో పూర్తి నైరాశ్యం కమ్ముకుంది. ఈ పార్టీలో ఉండడం దండగ అనే భావనకు వచ్చారు. ఎన్నికల ముందే చాలా మంది నాయకలు, కేడర్ పార్టీని వీడివెళ్లగా…ఓటమి తర్వాత దానికి మించి పెద్దఎత్తున నేతలు, కేడర్ పార్టీని వదిలేస్తారనే భయం జగన్‌రెడ్డికి కల్గింది. దీంతో కొత్త వ్యూహానికి తెరలేపారు.
పోలింగ్ జరిగిన నాలుగు రోజులు తర్వాత నుండి సోషల్ మీడియాలో, తన అనుకూల బ్లూ మీడియాలో తాము గెలవబోతున్నామంటూ పెద్ద క్యాంపెయిన్నే నడిపారు. ఈ క్యాంపెయిన్ను ముందుకు తీసుకెళ్లడం కోసం పెయిడ్ ఆర్టిస్టులైన వేణుస్వామి లాంటి జ్యోతిష్కులు, కె.నాగేశ్వర్ లాంటి ఎనలిస్టులను ఉపయోగించుకున్నారు. వీళ్లు ఎంత ప్రచారం చేసినా ప్రజలైతే నమ్మలేదు. కానీ వీరి అసలు లక్ష్యం కేడర్‌ను నమ్మించడం…కుదిరితే ప్రజలను కూడా బుట్టలో వేయడం. ఈ క్యాంపెయిన్ తర్వాత వైసీపీ కేడర్‌లో కొంత ఉత్సాహం వచ్చింది. నిజంగానే తాము గెలుస్తామా అనే ఆశ వారికి కలిగింది. దీంతో చాలా మంది బెట్టింగ్‌లకు కూడా దిగారు. అందరిలో కాకపోయినా సగం మంది కేడర్‌లోనైనా ఈ క్యాంపెయిన్ ద్వారా నమ్మకాన్ని కల్గించగలిగారు. అయితే వాస్తవ ఫలితాలు వేరుగా ఉంటాయని జగన్‌రెడ్డికి తెలుసు. గెలుస్తామని ఇంతగా నమ్మిన కేడర్ ఘోర పరాజయంతో మరింత నైరాశ్యంలోకి వెళ్లే అవకాశముంది. ఇది కూడా జగన్‌రెడ్డికి తెలుసు. అందుకే తనకు అలవాటయిన అబద్దాలను మరోసారి వల్లెవేసి కేడర్‌ను మభ్య పెట్టవచ్చననే భావనకు వచ్చారు. అందుకోసమే ఫలితాలు వస్తుండగానే ప్రెస్‌మీట్ పెట్టి ఏదో జరిగింది…ఆధారాలు లేవంటూ ఒక చర్చను ముందుకు తోశారు.
ఈవీఎంలపై నెపం
డీలా పడ్డ, నైరాశ్యంలో మునిగిపోయిన కేడర్.. పార్టీని వీడతారనే భయంలో.. జగన్ రెడ్డి అండ్ బృందం ఒక వ్యూహాన్ని ఎన్నికలు ముగిసిన వెంటనే రచించుకున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే వరుసగా తన కేడర్‌కు కూడా అబద్దాలు చెబుతూ మభ్యపెట్టుకుంటూ వచ్చారు. అది నమ్మి వేల కోట్ల రూపాయలు బెట్టింగ్గులో పోగొట్టుకున్న వైసీపీ అభిమానులు లక్షల్లో ఉన్నారు. అయినప్పటికీ వారిని మరింత మభ్యపెట్టి తన పార్టీపైన విశ్వాసం చెదరకుండా ఉండేందేకు ఈవీఎంలపై వివాదాన్ని ప్రారంభించారు. మనం గమనిస్తే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండి వైసీపీ నేతలు, వారి పెయిడ్ ఆర్టిస్టులు, వారి కునుసన్నల్లో ఉండే సోషల్ మీడియా, బ్లూ మీడియా ఈవీఎంలపై అనుమానాలను కల్గిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ప్రారంభించారు. ఏదో జరిగింది…అధారాలు లేవంటూ జగన్‌రెడ్డి అనుమానాలు కల్గిస్తే…ఈవీఎంల వల్లే అది జరిగిందనే ప్రచారాన్ని మిగిలిన వారంతా చేయడం ప్రారంభించారు. ఈ ప్రచారం రోజూ కొనసాగుతూనే ఉంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా చివరకు జగన్‌రెడ్డి కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. జగన్‌రెడ్డి, తన బ్లూ మీడియా చెప్పిన అబద్దాలను విని విని ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. కేడర్‌లో కూడా చాలా వరకు పునరాలోచన ప్రారంభమైంది. అయితే కొంతమంది మాత్రం ఇంకా గుడ్డిగా జగన్ను నమ్ముతున్నారు. వారు కూడా చేజారిపోతారనే భయంతోనే జగన్‌రెడ్డి ఈవీఎంల వివాదాన్ని ముందుకు తెచ్చారు. అందర్నీ అన్ని వేళలా మోసం చేయలేమనేది జగన్ కూడా వర్తిస్తుంది. ఆ మోసాన్ని కేడర్ కూడా గుర్తించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి.
ఇప్పుడే ఎందుకు జగన్ ట్వీట్
జగన్‌రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన చేసిన పాపాలు వరుసగా బయటకు వస్తున్నాయి. 500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి రుషికొండ మాయా మహల్ కట్టుకున్నారని టీడీపీ ఆధారాలతో సహా బయటపెట్టింది. అలాగే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి తాడేపల్లి ప్యాలెస్‌ను నిర్మించుకున్నారని కూడా టీడీపీ వెల్లడిరచింది. దీనికితోడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జగన్‌రెడ్డి చేసిన ద్రోహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బట్టబయలు చేయడంతో జగన్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. దీంట్లోనుండి బయటపడడానికి, తన తప్పుల మీద చర్చను పక్కదారి పట్టించేందుకు కూడా ఉపయోగపడుతుందని.. ఒక దెబ్బ రెండు పిట్టలను కొట్టవచ్చుననే దుర్భిద్దితో జగన్‌రెడ్డి మంగళవారం నాడే ఈవీఎంలపై వివాదాన్ని సృష్టించారు. అయితే ప్రజలు అంత అమాయకులేమీ కాదు.