- తనకు తానే మహత్మునిలా ఫీలవుతున్నాడు
- జగన్ తీసుకొచ్చే యాప్‌లో అతని బాధితులదే మొదటి ఫిర్యాదు
- సొంత చెల్లి, తల్లి, సునీతే ముందుకు ఫిర్యాదు చేస్తారు
- జగన్‌పై ధ్వజమెత్తిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
తిరుపతి (చైతన్య రథం): యావత్ భారతదేశంలో అత్యంత నీచంగా, క్రూరంగా రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్‌రెడ్డేనని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఘాటుగా విమర్శించారు. అధికారమదంతో అక్రమాలు, అరాచకాలతో భూమి, ఇసుక, మైనింగ్, మెడికల్, మద్యంవంటి దందాలకు పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నువ్వు కాదా జగన్? అంటూ మండిపడ్డారు. దోచుకుని దాచుకున్నదే కాకుండా ముఖ్యమంత్రిగా పనిచేశాననే విషయం మరిచిపోయి రాత్రికి రాత్రే మహాత్మునిలా, గౌతమ బుద్ధునిలా ప్రవర్తిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? అంటూ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్ తెస్తానంటూ జగన్ విద్వేషాలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. ‘జగన్ నీ పాలనలో నష్టపోయిన లక్షలాది కుటుంబాలు నువ్వు తీసుకొచ్చే యాప్‌లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నార’ని హెచ్చరించారు. ముందుగా నీ బాబాయ్ కూతురు సునీత, నీ చెల్లి, తల్లీ కూడా నువ్వు తీసుకొచ్చే యాప్‌లో ఫిర్యాదు చేయబోతున్నారని జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యంవల్ల చనిపోయిన 30 వేలమందికి సంబంధించిన కుటుంబాలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, నువ్వు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, జీఓ 22ఏ కారణంగా నష్టపోయిన బాధితులందరూ ఫిర్యాదుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలన్నింటినీ ఆధారాలతో సహా అప్‌లోడ్ చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, బాధితులు సిద్ధంగా ఉన్నారని రవినాయుడు హెచ్చరించారు. యాప్ పేరుతో అధికారులను భయపెట్టి ప్రభుత్వ పరిపాలనను విచ్ఛిన్నం చేసేందుకు వ్యూహాత్మకంగా కుట్రలకు పాల్పడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ పదేపదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టడం లేదని, ప్రజలకు దీనిపై పూర్తి స్పష్టత ఉందని అన్నారు. జగన్ పర్యటనల వల్ల ఎవరికి ప్రయోజనమో ముందు తేలాలని రవినాయుడు డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించడం మానేసి.. చంపేయండి, నరికేయండి, రప్పా రప్పా అంటే సన్మానాలు, సత్కరాలు చేస్తారా? అని నిలదీశారు. జగన్ పర్యటనలకు ప్రభుత్వం ఎక్కడా ఆంక్షలు విధించడం లేదని, ప్రజల్లో సానుభూతి కోసం జగన్ అబద్ధాలు చెప్పడం పరిపాటేనని దుయ్యబట్టారు.
రోజా నోరు అదుపులో పెట్టుకో..
మాజీమంత్రి రోజా వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారంటూ శాప్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా కుటుంబం ఎప్పుడైనా ప్రజా సేవ చేసిందా? అంటూ మండిపడ్డారు. ఏ రోజైనా మహిళలా ప్రవర్తించావా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హుందాగా ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టే ఆమెకు గౌరవం, అభిమానం, ఆదరణలు లభిస్తున్నాయని, ఏనాడైనా నువ్వు ప్రజాసేవలో గౌరవంగా మెలిగిన సందర్భాలున్నాయా? అంటూ నిలదీశారు. రోజా రాజకీయాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు పెట్టిన భిక్షేనన్న విషయం గుర్తెరగాలన్నారు. రోజా చేష్టలను చూస్తున్న రాష్ట్ర మహిళలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలే అడ్డుపడుతున్నారంటూ శాప్ ఛైర్మన్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో తిరుపతి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, టీడీపీ నాయకులు రామగోపీ, శ్రీనివాస్ యాదవ్, తోట వాసుదేవ, రఫీ, రంజిత్ నాయుడు, కొట్టే హేమంత్ రాయల్, దిలీప్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.