- వివేక హత్య కేసు సూత్రధారులెవరో సీబీఐకి తెలుసు
- జగన్, విజయసాయి, అవినాష్‌లను ఎందుకు విచారించలేదు?
- నేనే చట్టం అన్నట్లున్నది జగన్ ధోరణి
అమరావతి: పాత తెలుగు సినిమాల్లో బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అన్నట్లు జగన్ రెడ్డి దెబ్బ అంటే సీబీఐ అబ్బ అంటోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి లోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు సీబీఐ రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేయాలంటే భయపడుతోంది. లోకల్ పోలీసు వ్యవస్థ సీబీఐ కి సహకరించకపోగా సహాయ నిరాకరణ చేస్తోంది. జగన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు వరకు సీబీఐ కేసు దర్యాప్తు చేస్తే లోకల్ పోలీసు వ్యవస్థ భయపడే పరిస్థితి ఉండేది. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక సీబీఐ రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేయాలంటే భయపడుతోంది. ఏపీ పోలీసులు సీబీఐ అధికారులపై ప్రైవేటు కేసులు బనాయిస్తున్నారు. లోకల్ పోలీసులు సీబీఐ పై ఎప్పుడు ఏ కేసులు పెడతారో, ఏ సీబీఐ అధికారిని లాక్కెళ్తారో, ఎవరు చార్జిషీట్ పెడతారో అనే భయంలో సీబీఐ ఉంది.
వివేక హత్య కేసులో సూత్రదారులు సీబీఐకి తెలుసు
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు గడుస్తున్నా ఆయన బాబాయి వివేక హత్య కేసును సీబీఐ విచారించలేని పరిస్థితి. వివేక హత్య కేసు వెనుక సూత్రధారులు ఎవరో సీబీఐకి తెలుసు. దోషులను పట్టుకోకుండా అడుగడుగునా సీబీఐకి ఎవరు అడ్డు పడుతున్నారో ప్రజలందరికి తెలుసు. వివేక హత్య కేసులో ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేస్తారన్న ప్రతిసారి జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. జగన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతి సారి ఏం జరుగుతుందో తెలియదు. సీబీఐ మాత్రం వివేక కేసులో వెనుకడుగు వేస్తోంది. సీబీఐపై కేసులు పెట్టే చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేదు. నేనుండగా నాదే చట్టం మరోచట్టం లేదని జగన్ ధోరణిగా ఉంది. రాజకీయ వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తిస్తుంటే నేరాల దర్యాప్తు రాష్ట్రంలో ఎలా కొనసాగుతుంది. డబ్బుండి దౌర్జన్యం చేసిన వారే అభివృద్ధి చెందే పరిస్థితులు తేవాలనుకుంటున్నారు.
నేరస్థులను తప్పించడానికి కొత్త చట్టాలు
ఎంతో మంది మహానుభావులు, ముఖ్యమంత్రులు జైలు జీవితాలు గడిపిన చరిత్ర ఉంది. ఇందిరా గాంధీ సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా చేసిన ఉక్కు మహిళ. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కాదని నేరస్థులను తప్పించడానికి కొత్త చట్టాలను అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అరెస్టు చేయొద్దని చెబితే సీబీఐ చేయదా? ఏ1 ముద్దా యి జగన్‌ని, ఏ2 ముద్దాయి విజయసాయిని ఇంత వరకు సీబీఐ విచారణ చేయలేదు. ముఖ్యమంత్రి ఏమై నా సీబీఐకి అతీతుడా? వివేకది గుండెపోటు అని ప్రకటించిన విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదు? అనుమానితుడుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణ చేయలేదు. సామన్యుడికి న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.