- పోలీస్ వ్యతిరేక వ్యాఖ్యలపై కేసు పెట్టాలని సూచన
అమరావతి (చైతన్య రథం): ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి, నేడు గుర్తింపులేని విపక్ష నేతగా మిగిలన జగన్‌రెడ్డి.. అధికారం కోసం అనుచిత వ్యాఖ్యలకు దిగజారుతున్నారని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. గురువారం నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన గూడుకట్టుకున్న భయాన్ని తేటతెల్లం చేస్తోందని ఎద్దేవా చేశారు. వేలకోట్ల మద్యం కుంభకోణంలో పాత్రధారులంతా బహిర్గతమై.. అసలు సూత్రధారి తేలే సమయం ఆసన్నమైన తరుణంలో జగన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు దిగడం ఆయనలోని భయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. సిట్ దాడులలో రూ.11కోట్ల మద్యం డంపు స్వాధీనమైన దగ్గర్నుంచే జగన్‌రెడ్డిలో వణుకు ప్రారంభమైందని సత్యకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలకు తెగబడిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి జగన్ వత్తాసు పలకడం `ఆ పార్టీ అనైతిక రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగిరీ వెలగబెట్టిన ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసులు పెట్టడం తప్పంటున్న జగన్‌రెడ్డికి.. చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని విస్మరించే అరెస్ట్‌లకాండ సాగించారా? అని నిలదీశారు. సొంత పార్టీలోవున్న రఘురామ కృష్ణంరాజుపై పోలీసు జులుంకు ఆదేశించినపుడు.. ఆయన ఎంపీ అన్న విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అప్పటి ప్రతిపక్ష నేత అచ్చన్నాయుడు, కొల్లు రవీంద్రవంటి నేతలను అక్రమ కేసులతో వేధించినపుడు.. వారి రాజకీయ అనుభవాలు స్పురణకు రాలేదా? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ పర్యటనలను అక్రమంగా అడ్డుకున్నప్పుడు జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా పాతరేశారో ప్రజలందరికీ తెలిసిన విషయమేనని మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలను పవిత్రులుగా ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాలకే తలవొంపులని మంత్రి దుమ్మెత్తిపోశారు. దిగజారుడు వ్యాఖ్యలతో జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రమాణాలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే విధానాలను మరోసారి వెల్లడిరచుకున్నారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో జగన్‌రెడ్డి చేస్తోన్న అనుచిత వ్యాఖ్యలు ఆయన అంతరంగాన్ని వెల్లడిస్తోందని సత్యకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయించిన ఘోర పాపం జగన్‌రెడ్డిని తీవ్రంగా వెంటాడుతోందని మంత్రి సత్యకుమార్ అంటూ.. అందుకే జగన్‌రెడ్డి ఆస్థిమిత వ్యాఖ్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థను ప్రజల్లో చులకన చేసి, వ్యవస్థ నైతిక స్థయిర్యాన్ని, విశ్వసనీయతను దెబ్బతీస్తోన్న జగన్‌రెడ్డి వ్యాఖ్యలను రాజద్రోహంగా పరిగణించి.. జగన్‌రెడ్డిపై కేసు నమోదు చేసే సమయం అసన్నమైందని మంత్రి సత్యకుమార్ అభిప్రాయపడ్డారు.