- తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తెస్తా
- తెలుగు రాష్ట్రాలు రెండూ.. నాకు రెండు కళ్లు
- మనం సాధించిన అభివృద్ధే ఇక్కడ కొనసాగుతోంది
- మళ్లీ జన్మంటూవుంటే తెలుగుగడ్డపైనే పుడతా
- టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉద్వేగం
- ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అగ్రనేతకు ఘనస్వాగతం
హైదరాబాద్ (చైతన్య రథం): తెలుగుజాతి ఉన్నంత వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తామన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నా గెలుపు కోసం తెలంగాణలోని కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేశారని అభినందిస్తూ, ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది తెలంగాణ గడ్డపైనేనని గుర్తు చేశారు. అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, తెలుగుజాతికి అన్యాయం జరుగుతుంటే కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజల సమక్షంలోనే పార్టీకి తెలుగుదేశం అని నామకరణం చేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే టీడీపీకి తెలంగాణ గడ్డపై పూర్వవైభవం కనిపిస్తోందన్నారు. ‘ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ, ఏపీ నాకు రెండు కళ్లు లాంటివి. రెండు ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ పని చేస్తోంది. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలనే ఆలోచించా. చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుజాతి కోసం పనిచేస్తా’నని ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగుజాతి ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది
తెలుగు జాతికి ఎన్టీఆర్ గౌరవం తెచ్చారు. తెలుగువారిని ప్రపంచానికి చాటి చెప్పి ఆత్మగౌరవాన్ని పెంచారు. కరణం, పటేల్ పట్వారీ వ్యవస్థలను ఎన్టీఆరే రద్దు చేసి అనేక సంస్కరణలను తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేయడంతో తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయిలో స్వాతంత్య్రం వచ్చిందన్న సంతోషం ఎప్పటికీ ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగురాష్ట్రాల్లో వెనకబడిన వర్గాలు బాగుపడ్డాయంటే అది ఎన్టీఆర్ చొరవతోనేనని గుర్తు చేసిన చంద్రబాబు, పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి సంక్షేమానికి నాంది పలికినట్లు వివరించారు. 2004నుండి 20ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తల్లో పట్టుదల ఏమాత్రం తగ్గలేదన్నారు. టీడీపీపట్ల కార్యకర్తల్లో రోజురోజుకూ అభిమానం పెరుగుతోందని.. నాయకులు పోయినా కార్యకర్తలు ఇప్పటికీ పసుపు జెండాని విడవలేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం జెండా ఈ ప్రాంతంపై రెపరెపలాడుతుంది. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్, పీవీ తెలుగుగడ్డపై పుట్టినవారే
‘తెలుగుజాతి కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. నాతోపాటు నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా తిరుగులేని శక్తిగా ఎదిగాం. నన్ను ఏ కారణం లేకుండా జైల్లో పెట్టారు. నా అరెస్టు సమయంలో హైదరాబాద్‌లో మీరు చూపించిన చొరవ మర్చిపోలేను. గచ్చిబౌలిలో లక్షలమంది వచ్చి మద్దతుగా నిలిచారు. నేను చేసిన అభివృద్ధికిగాను సంఫీుభావం ప్రకటించారు. తెలుగుజాతి ఎప్పుడూ ఎన్టీఆర్‌ను మర్చిపోదని అన్నారు. దేశానికి దశదిశను చూపిన వ్యక్తి పీవీ నరసింహారావును మననం చేసుకున్న చంద్రబాబు, ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంతో పాటు సంపద సృష్టి ఆయన కాలంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎన్టీఆర్, పీవీ తెలుగుగడ్డపైనే పుట్టారు. రాజకీయమంటే సొంత వ్యాపారం చేసుకోవడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం నిజమైన రాజకీయమని ఈ ఇద్దరు తెలుగు బిడ్డలు నిరూపించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎవరికీ ఇవ్వని గౌరవం తెలుగుజాతి నాకు ఇచ్చింది
‘ఏ నాయకుడికీ ఇవ్వని గౌరవం తెలుగుజాతి నాకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుగడ్డపైనే పుడతాను’ అని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి త్వరలో కమిటీ వేస్తామని, రాజకీయాలు ఎలావున్నా జాతి ప్రయోజనాలే ముఖ్యం కావాలని బాబు సూచించారు. ‘తెలుగునేలపై నేను తిరగని ప్రాంతం లేదు. ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు తెలియని ఊరు లేదు. నా జీవితంలో చివరి రక్తం బొట్టు వరకూ ప్రజలకు ఏంచేయాలో చేస్తూనే ఉంటా’నని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మొన్నటి ఏపీ ఎన్నికల్లో వినూత్నంగా ఆలోచించా. యువతకు అవకాశాలు కల్పించాను. ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు. తెలుగుదేశం చరిత్రలో ఇంతటి విజయం మునుపెన్నడూ చూడలేదు. వచ్చిన సునామీలో నాటి విధ్వంసకర ప్రభుత్వం కొట్టుకుపోయింది. ప్రజాస్వామ్యంలో రాజులు, నియంతులు లేరు. విర్రవీగితే ఎక్కడికి పంపాలో ప్రజలకు తెలుసు. ప్రజలకు సేవకులమే తప్ప…పెత్తందారులం కాదు’ అని బాబు వ్యాఖ్యానించారు. సీబీఎన్ 1995…2024 కాదు. 1995లో ఏవిధంగా పని చేశానో అదేవిధంగా చేస్తా. ఆకస్మిక తనిఖీలతో తెల్లవారుజామున తిరిగి సమస్యలు పరిష్కరించాను. శ్రమదానం, జన్మభూమితో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. సైబరాబాద్ నిర్మించి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్‌ను తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.