- పలు సంస్థలకు భూకేటాయింపులకూ ఓకే
- ఇక ప్రతి మండలంలో వర్క్ స్టేషన్లు..
- వర్క్ స్టేషన్లు పెట్టేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం
- క్వాంటం కంప్యూటింగ్‌కు ఏపీ కేంద్రస్థానం
- విశాఖలో ఐటీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
- ఉండవల్లివద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ `2కి ఓకే
- సీఐఐ సమ్మిట్‌లోనే సింగపూర్‌తో ఒప్పందాలు
- డేటా లేక్ ప్రాజెక్టుపై ‘టాటా’కు క్లియరెన్స్
- అజెండాలోని 70 అశాలపై చర్చ, ఆమోదం
- కేబినెట్ వివరాలు వెల్లడిరచిన మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు. క్వాంటం కంప్యూటింగ్ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సచివాలయ నాల్గవ భవనం ప్రచార విభాగంలో సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక నూతన పాలసీలను రూపొందించిన ఫలితంగా ప్రపంచంలోని అనేక దిగ్గజాలు రాష్ట్రంవైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్యాబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన మంత్రిమండలి సమావేశంలో.. అజెండాలోని 70 అంశాలపై చర్చించారు. క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతోందని మంత్రి స్పష్టం చేస్తూ.. బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లక్ష్యమన్నారు. 5 వేలమంది నిపుణులు, స్టార్టప్‌లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నట్టు మంత్రి వెల్లడిరచారు.
దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. క్వాంటం కంప్యూటింగ్ విధానానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నేషనల్ క్వాంటం మిషన్‌తో మేధావులను అనుసంధానించుకుంటూ సాగే విధానం అమలుకు ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాలు తయారు చేసే సంస్థలు, నిపుణులకు ఏపీని కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంవల్ల, స్టార్టప్‌లు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తాయని మంత్రిమండలి ఆశాభావం వ్యక్తం చేసింది. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే క్వాంటం కంప్యూటింగ్ మిషన్ అమలు లక్ష్యంగా నిర్దేశించింది. 5 వేలమందికి పైగా నైపుణ్యం కలిగిన నిపుణులు రాష్ట్రానికి రానున్నారని అంచనా వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ.. వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వ ఆర్ధిక సాయం అందించాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. అలాగే, విశాఖలో పలు ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్.. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
విశాఖలో రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు, రుషికొండ, కాపులుప్పాడలో పలు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి, ఓర్వకల్‌లో పలు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదిస్తూ.. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో 50 ఎకరాల్లో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రియల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిర్లా గ్రూప్‌నకు నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి కేటాయింపు ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించినట్టు మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కోసం 100 ఎకరాల భూమి కేటాయింపునకు ఓకే చెప్పింది. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంటు కోసం బిర్లా గ్రూప్‌నకు భూమి కేటాయింపు, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 150 ఎకరాల భూమి కేటాయింపు, కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సుగుణ గ్రూప్ ఆధ్వర్యంలో అనంతపురంలో టీఎంటీ బార్స్ తయారు చేసే ప్లాంట్ కోసం 300 ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూముల (బదిలీ నిషిద్ధ) చట్టం సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ.. అసైన్డ్ భూములను అవసరాల కోసం 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌కు.. హడ్కో ద్వారా బ్యాక్-టు-బ్యాక్ రుణ మద్దతు అందించడానికి ఏపీఎంబీ బోర్డు తీర్మానం, ఏపీఏడీసీఎల్ కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ జారీ చేసే అధికారం ఇవ్వడానికి, అలాగే సహాయక ప్రభుత్వ సంస్థ ద్వారా ఏదైనా లోటు ఏర్పడితే చెల్లింపులు చేసే హామీతో ప్రభుత్వ ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ జారీ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కుప్పం, దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటుకు వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు హామీ ఇవ్వాలని నిర్ణయించింది. విశాఖలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం ప్రతిపాదనను ఆమోదించింది. 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహంచనున్న 30వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన, డిజిటల్ పరిపాలన, రియల్-టైమ్ పరిపాలన, మానవ వనరుల అభివృద్ధి, సుస్థిర ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అమరావతి క్యాపిటల్ సిటీలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో ఉండవల్లి వద్ద మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్-2 (సామర్థ్యం 8400 క్యూసెక్స్) డిజైన్, నిర్మాణం, పరీక్ష మరియు కమీషనింగ్, అలాగే పదిహేనేళ్ల నిర్వహణకు రూ.595.01 కోట్లకు పరిపాలన ఆమోదం ఇచ్చేందుకు, ఈ పనులకు ప్రపంచ బ్యాంక్, ఎడీబీ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చి టెండర్లు ఆహ్వానించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కృష్ణయ్యపాలెం, వెంకటపాలెం, పెనుమాకలో రోడ్లు, డ్రైనేజీలు, సదుపాయాల కల్పనకు రూ.1863 కోట్లతో కాంట్రాక్ట్ ఇచ్చేందుకు మంత్రిమండలి అంగీకరించింది. జీవిత ఖైదు పడిన ముగ్గురు ఖైదీ (మధిరి సువర్ణ రాజు, కటికిరెడ్డి నాగేశ్వరరావు, వడ్డే శ్రీనివాసులు)లకు క్షమాభిక్ష ప్రసాదించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జీవిత ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించినపుడు పునరావాసం, సమాజంలో తిరిగి విలీనమయ్యే అవకాశం పెరుగుతుందని మంత్రిమండలి అభిప్రాయపడిరది. సంతమాగలూరులో 1000 ఎకరాల స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదిస్తూ.. కర్నూలు జిల్లా హోళగుంద, ఆలూరులో 2 మెగావాట్‌ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎపీపీఎఫ్‌సీఎల్‌కు పలు సంస్థల ద్వారా రూ.5 వేల కోట్ల రుణాలు పొందేందుకు క్యాబినెట్ ఆమోదిస్తూ.. ధర్మవరం ప్రాంతంలో ‘‘మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్’’ ఏర్పాటుకు 9.84 సెంట్ల ప్రభుత్వ భూమిని మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన దాని ప్రకారం నెలకు రూ.10,000/- స్థిర అద్దె చెల్లింపుతో 25 ఏళ్లకు యాజమాన్య హక్కులు బదిలీ చేయకుండా హ్యాండ్‌లూమ్ శాఖకు అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనివల్ల ధర్మవరం ప్రాంతంలోని పేద చేనేత కార్మికుల అభ్యున్నతి, స్థిరమైన అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రిమండలి అభిప్రాయపడిరది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ డేటా లేక్ ప్రాజెక్ట్ యొక్క డిజైన్, అభివృద్ధి, అమలు, ఆపరేషన్లు, నిర్వహణకు సిస్టమ్ ఇంటిగ్రేటర్‌గా నియామకానికి మెస్సర్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మూడేళ్ల కాలానికి షెడ్యూల్ విలువ రూ.181కోట్లమేర కోట్ చేసిన సింగిల్ బిడ్ ఆమోదానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఆర్ధిక సాయం కింద రాష్ట్రం రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేలు ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల `రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ప్రాముఖ్యత దక్కుతుందని, ఈ పథకం హామీ ఇవ్వబడిన ఆదాయ మద్దతును అందించడం ద్వారా సాగు, జీవనోపాధి అవసరాలను తీర్చడానికి వీలు కలిగి వ్యవసాయ కుటుంబాలను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని మంత్రిమండలి అభిప్రాయపడిరది. 2025-26 ఖరీఫ్‌లో కనీస మద్దతు ధర కింద వరి ప్రొక్యూర్‌మెంట్ ఆపరేషన్ల కోసం ఏపీఎస్‌సీఎస్సీఎల్‌కు ప్రభుత్వ గ్యారెంటీ గరిష్ట పరిమితిని రూ.39,000 కోట్ల నుంచి రూ.44,000 కోట్లకు పెంచేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
తిరుపతి రూరల్ వావిలాల గ్రామంలో 2 ఎకరాలను టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి లీజు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0లో 100 ఎకరాల భూమిని ఎపీ టిడ్కోకి ఇచ్చే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. మచిలీపట్నం సమీపం మాచవరంలో 1.60 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ కృష్ణ జిల్లా శాఖకు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలకు ఇచ్చిన భూమిని లీజు 33నుంచి 66 లేదా 99ఏళ్లకు పెంచే సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెవెన్యూ వ్యవస్థలో ఫిర్యాదులు లేకుండా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రిమండలిని ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. మొంథా తుఫానులో ప్రజా ప్రతినిధులు కష్టపడి పనిచేశారని సీఎం చంద్రబాబు కితాబునిచ్చారన్నారు.















