లండన్ (చైతన్యరథం) లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. యూకేలోని వివిధ యూనివర్సిటీలు ఏపీతో నాలుగు అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఏపీలో ఆయా యూనివర్సిటీ కేంద్రాలను ప్రారంభించే అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్రం సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకునే అంశంపైనా వీరిద్దరూ చర్చించారు. అక్కడి యూనివర్సిటీలు ఇక్కడి విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే అంశంపై, అలాగే యూనివర్సిటీలు, విద్యాసంస్థల మధ్య విద్యార్థుల ఎక్సేంజ్ అంశం గురించి, లైఫ్ సైన్సెస్, బయో జెనెటిక్స్, ఖనిజాల వెలికితీత, మెటల్స్ అంశాల్లో ఏపీ.. యుకె యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యాల ఏర్పాటు గురించి సీఎం చంద్రబాబు చర్చించారు. అలాగే ఏఐ, సెమీ కండక్టర్, స్పేస్ టెక్నాలజీ, కోర్ ఇంజనీరింగ్, మెరైన్ ఇండస్ట్రీ 4.0లో సహకారం గురించి కూడా ఇరువురు మధ్యా చర్చలు జరిగాయి.












