- రాజధానిలేని రాష్ట్రంగా గుర్తించాలి
- రెవిన్యూ లోటునూ పరిగణించాలి
- విద్య, వైద్యానికి సెక్టార్లవారీ గ్రాంట్స్
- 16వ ఫైనాన్స్ కమిషన్‌కు తెదేపా వినతి
- ఇతోధికంగా నిధులివ్వండి: జనసేన
- పార్టీల అభిప్రాయాలు తీసుకున్న ఫైనాన్స్ కమిషన్
అమరావతి (చైతన్య రథం): ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక క్లిష్టపరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి కేంద్రం వాటాను పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యులు మనోజ్ పాండా, అన్నే జార్జ్ మాథ్యూలు బుధవారం నోవాటెల్ హోటల్‌లో వివిధ రాజకీయ పక్షాలను కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు.. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వి చిరంజీవి రావు, మాజీ ఎమ్మెల్సీ పి అశోక్‌బాబులు మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర రెవెన్యూ లోటును పరిగణలోకి తీసుకుందని గుర్తుచేస్తూ.. 16వ ఆర్థిక సంఘం సైతం రెవెన్యూ లోటును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అలాగే, రాష్ట్రంలోని ఆర్థిక క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం కేటాయింపుల వాటాను పెంచాలన్నారు. విద్య, ఆరోగ్య రంగాలకు సెక్టార్లవారీగా గ్రాంట్స్‌ను అందివ్వాలన్నారు.
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏపీ అనే విషయం గుర్తుంచుకుని, పాపులేషన్ లెక్కలను కూడా 1971 జనాభా లెక్కల ప్రకారంగా సిఫార్సులుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. పాపులేషన్ గ్రోత్ రేట్ ఆధారంగా నిధులు పంపకాలు ఉండాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ వాటా పెంచాలని విజ్ఞప్తి చేస్తూ.. రాష్ట్రంలో వెనుకబడివున్న ప్రాంతాలకు నిధులు పెంచాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
జనసేన పార్టీ ప్రతినిధులుగా ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరదన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చేవిధంగా ఏపీకి ఆర్థిక సాయం అందించాలని కోరారు. స్థానిక సంస్థల బలోపేతానికి చేయూత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రోడ్లు చాలావరకు ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటి అభివృద్ధికి నిధుల సాయం చేయాలన్నారు. రాష్ట్రంలోని 972 కిమీ కోస్టల్ లైన్ అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రానికి 90శాతం గ్రాంటుగా నిధులు అందించాలన్నారు.
తాగు నీరు, రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నగర, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. వాటర్ వర్క్స్ నిధులు, జలజీవన్ మిషన్ ఫండ్స్ రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్‌కు నిధులు పెంచాలన్నారు. బీజేపీ ప్రతినిధులుగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్, ఎంఎల్‌ఏ ఆదినారాయణ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు పెంచాలన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులు కన్నా 15వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులు తక్కువగా ఉన్నాయని, అవి ఎందుకు తగ్గుతున్నాయో పరిశీలించి సరిచేయాలన్నారు. రాష్ట్రానికి ఉన్న తీరప్రాంతం ద్వారా ఆర్ధికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చని, రాష్ట్రంలో రంగాలవారీగా నిధులు పెంచాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో నిధులు పెంచాలని, నాచురల్ ఫార్మింగ్‌కు రాష్ట్రంలో ప్రాముఖ్యత పెరుగుతుందని ప్రాధాన్యత కల్పించాలన్నారు. రోడ్లకు ఫండిరగ్ ఇవ్వాలని, రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
సీపీఎం నేతలు వెంకటేశ్వరరావు, బాబురావులు మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నిధులతోనే నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసి అభివృద్ధికి చేయూత నందించాలన్నారు. బుందేలుఖండ్ తరహాలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులను కేటాయించాలన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన రుణాలు పెరిగిపోతున్నాయని, వాటిని మాఫీ చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి, రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్‌రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వము విడుదల చేయాలని కోరారు. స్థానిక సంస్థలకు గ్రాంట్లు విడుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసము, పరిహారానికి నిధులిచ్చి.. నిర్మాణంలో జాప్యాన్ని నివారించాలన్నారు. ఆమ్ ఆద్మీ ప్రతినిధులు నేతి ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం తోడ్పాటు అందించాలని కోరారు. రెవెన్యూలోటును తగ్గించడంలో కేంద్ర నిధులు అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందన్నారు.