- వివిధ శాఖల డేటా అనుసంధానతపై సీఎం ఆదేశాలు
- శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
- సీసీ కెమెరాలు విస్తృతిని పెంచాలని సూచన
- వాట్సాప్ గవర్నెన్స్’పైనా మరింత ఆలోచన చేయండి
- ఆర్టీజీఎస్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అన్ని శాఖల డేటాను ఆర్టీజీఎస్‌తో అనుసంధానించే పని మరింత వేగవంతం కావాలన్నారు. డేటా మొత్తం ఒకచోటుకు చేర్చి డేటాలేక్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, మెరుగ్గా అందించేందుకు వీలుంటుందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డీప్ టెక్నాలజీలాంటి సాంకేతికతలను ఉపయోగించుకుని డేటాను విశ్లేషించుకుని ఆయా శాఖల పనితీరు మెరుగుపర్చడానికి దోహదపడేలా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం అందించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభంగా సేవలు అందించగలమని, ప్రస్తుతం అందిస్తున్న సేవలతోపాటు అదనంగా ఏం అందించగలమో పరిశీలించాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించేవారికి సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు విస్తృతంగా సీసీ కెమెరాలు
రాష్ట్రంలో ఇప్పటివరకు 14,770 సీసీ కెమెరాలు వినియోగంలో ఉన్నాయని, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరస్థులను పట్టుకోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తదితర సాంకేతికను ఉపయోగించుకోవాలన్నారు. నేరస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు కీలక పాత్రపోషిస్తాయన్నారు. నేరం జరిగిన వెంటనే సమీప పోలీసు స్టేషన్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వెళ్లి, నేరస్థులు పారిపోకుండా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపైన కూడా ముందుగానే నిఘాపెట్టి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఆర్టీజీఎస్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఏయే దశల్లో ఉన్నాయో ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విస్తృతంగా వినియోగించుకోవడానికి గూగుల్ సంస్థ సహకారం అందిస్తోందని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్త, సీఎం కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా, జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.