- సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్రగా రాష్ట్రం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ధీమా
ఏలూరు (చైతన్యరథం): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ విజయం ఖాయమన్నారు. సంపద సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికను సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్నారన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పేరాబత్తుల రాజశేఖర్ ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్‌కి మధ్య ఒక వారధిలా వ్యవహరించగలరన్నారు. పట్టభద్రులు ఆయనను గెలిపించాల్సిన అవసరముందన్నారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాం. రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు వస్తున్నారు. అపార అనుభవమున్న చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండడం మన అదృష్టం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి అభ్యర్థిని గెలిపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారం మాకు మెండుగా ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సహకారం కూడా ఉంది. చంద్రబాబు ఇచ్చిన సూపర్-6 హామీలను అమలుపరుస్తాం.
కాస్త సమయమివ్వాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. వైసీపీ ఐదేళ్ల పాలనలో లిక్కర్ స్కామ్ చేసింది. యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసింది. జగన్ ఒక నియంతలా పరిపాలించారు. మళ్లీ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడానికి కాస్త సమయం పడుతుంది. సూపర్ 6 లోని కొన్ని పథకాలను అమలు చేశాం. అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, ఉచిత సిలెండర్ల పంపిణీ అమలు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నీ జరుగుతాయి. సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ నేతలు సంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు. అన్నీ బకాయిలు పెట్టి వెళ్లారు. ఆసుపత్రుల బిల్లుల్లో బకాయిలు, పిల్లల ఫీజులు బకాయి, అన్నీ బకాయిలు పెట్టి పోయారు. మేం ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తాం. దీనికంటే ముందు వ్యవస్థల్ని గాడిలో పెట్టాల్సివుంది. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకుడు. అసెంబ్లీకి వచ్చేది లేదు.. ఏం చెప్పాలన్నా మీడియా ముందు చెబుతామని జగన్ అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కాదు. చంద్రబాబు తన అనుభవంతో సంపద సృష్టిస్తారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో ముందుకు తీసుకెళ్తారు, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.