మంగళగిరి, చైతన్యరథం: కష్టపడే తత్వం, పట్టదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్ లోని పై కేర్ డేటా సెంటర్ ను ఆమె సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారి ఆహ్వానం మేరకు పై కేర్ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీయువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ… సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. నేనివ్వాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు నా భర్త నారా లోకేష్, మా అత్తమామల సహకారమే కారణం. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయి. కొత్త కంపెనీల జాడ లేదు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నేను మీ యువతను కోరేది ఒక్కటే. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. అభివృద్ధికి పట్టం కట్టండి. మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాట వినబడదు. అలాగే..రాబోయే కాలంలో ఈ పై కేర్ కంపెనీ 10 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని నాకు నమ్మకం ఉందని బ్రాహ్మణి పేర్కొన్నారు.
పై కేర్ కంపెనీ చైర్మన్ శ్రీమన్నారయణ మాట్లాడుతూ 2014-19 మధ్య ఏపీకి వచ్చిన మొట్టమొదటి ఐటీ కంపెనీ మా ఈ పై కేర్ డేటా సెంటర్. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నారా లోకేష్ ఎంతో తపన పడేవారు. ఆయన ప్రోత్సాహంతోనే మంగళగిరిలో కంపెనీ ప్రారంభించాం. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారం అందలేదు. అయినప్పటికీ మేము ధైర్యంగా కంపెనీ నడుపుతున్నాం. భవిష్యత్ లో మరింతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కాగా నారా బ్రాహ్మణితో మాట్లాడేందుకు ఐటీ ఉద్యోగులు ఉత్సాహం కనబరిచారు. భవిష్యత్ లో మరిన్ని కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కార్యక్రమం జరిగినంతసేపు కంపెనీ ప్రాంగణమంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తింది.