- జియో మైసూర్, డెక్కన్ గోల్డ్.. రూ.405 కోట్ల పెట్టుబడి
- దశల వారీగా పెరగనున్న బంగారం వెలికితీత
- ఉత్పత్తి విలువలో రాష్ట్ర ఖజానాకు 4 శాతం రాయల్టీ
- గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కూ శంకుస్థాపన
అమరావతి (చైతన్య రథం): బంగారు నిక్షేపాల గని అంటే కర్నాటక రాష్ట్రంలోని కేజీఎఫ్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఆ స్థానంలో జొన్నగిరి పేరు మార్మోగనుంది. కరవు కేకలు వినిపించిన ఒకప్పటి కర్నూలు జిల్లా ఇక బంగారం ఉత్పత్తికి ప్రధాన వేదికకానుంది. దేశంలోనే ప్రయివేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటైంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనున్నాయి. దీనికి తగినట్టుగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. రెండోదశలో మిగిలిన ప్రాంతంలోనూ ప్లాంట్ విస్తరించనున్నారు. ప్రస్తుతం ఏర్పాటైన ప్లాంట్ ద్వారా తొలి ఏడాదికి 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాదినుంచి 900 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తారు. ఈ రకంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఉత్పత్తి పెరుగుతూ… ఏడాదికి 2 టన్నుల వరకూ బంగారం ఉత్పత్తి చేయనున్నారు. ఈమేరకు ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రాసెసింగ్ కెపాసిటీని విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 700మందికి ఉపాధి లభిస్తుంది. ఇక ఉత్పత్తి చేసిన బంగారం ధరలో 4 శాతం రాష్ట్రానికి రాయల్టీగా వస్తుంది. మొదట తీసే 400 కేజీలకు రూ.57 కోట్లు, 900 కేజీలకు రూ.144 కోట్ల వరకూ రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుంది.
ప్రారంభోత్సవం… శంకుస్థాపన
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కూ శంకుస్థాపన చేయనున్నారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు రూ.405 కోట్ల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే కర్మాగారాన్ని నెలకొల్పాయి. ఇందుకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 18 కి.మీ. పైపులైన్‌తో 0.021 టీఎంసీని వినియోగించనున్నారు. ఈమేరకు బుధవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బంగారం ఉత్పత్తి పనులు ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గనిలో ట్రయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
కర్నూలు జిల్లాలో బుధవారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవం సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు జొన్నగిరి చేరుకుంటారు. 11.45 గంటలకు ప్లాంట్ మొదటి యూనిట్‌ను ప్రారంభించి… అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారు.















