- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీదే భవిష్యత్
- ఏపీకి ఏడాదిలోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- ఐఓడీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు
- లండన్ లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో సీఎం చంద్రబాబు
లండన్ (చైతన్యరథం) రేపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత పాలకులు, నేటి పారిశ్రామిక వేత్తల మీద ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు అన్నారు. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రెండు అవార్డులు అందించింది. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును నారా భువనేశ్వరి అందుకున్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమె అందుకున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్స్టెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు విభాగంలో ప్రకటించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఇదే వేదిక మీద సంస్థ ఎండీ హెూదాలో భువనేశ్వరి అందుకున్నారు. మంగళవారం లండన్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ కార్పొరేట్ ప్రపంచానికి 35 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ప్రతిష్టాత్మక సంస్థగా ఐవోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. ఇలాంటి సంస్థ నారా భువనేశ్వరి సేవలను గుర్తించడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ అవార్డు దక్కించుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ సుదీర్ఘమైన చారిత్రక బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జూలై 2025లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు వంటి వాటిల్లో సహకారానికి ఆ ఒప్పందం బలమైన పునాది వేసింది. భారత్ తన 100 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తోంది… ఆ దిశగా అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా విజన్
ప్రపంచంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కానీ.. వివిధ సంస్థలు కానీ ప్రణాళికల్లోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భౌగోళిక, రాజకీయ మార్పులతోపాటు వాతావరణ సంక్షోభాలను అధిగమించాలి… టెక్నాలజీ విసిరే సవాళ్లను ఎదుర్కోవాలి. దీని కోసం దూరదృష్టి, పక్కా ప్లానింగ్ ఉండాలి. 1990లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తుపై సందేహాలు ఉన్నా… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిల్ గేట్స్ను ఆహ్వానించి హైదరాబాద్లో మైక్రోసాప్ట్ను స్థాపించేందుకు చొరవ తీసుకున్నాను. ఇప్పుడు, భారతీయులు, ప్రత్యేకించి తెలుగు వారు గ్లోబల్ ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా మనం ఆలోచనలు చేయాలి. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధానాలను… ప్రణాళికలను రూపొందించుకుంటున్నాం. గూగుల్ తన అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని అమెరికా వెలుపల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది. ఇది రాష్ట్రంలో ఇన్నోవేషన్స్,రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాల అభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
టెక్నాలజీతో ప్రజలకు సేవలు
టెక్నాలజీ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడేలా ఉండాలి. అలాగే టెక్నాలజీతో మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మేం ఆ దిశగానే ప్రయాణిస్తున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ను తాకిన ‘మొంథా’ తుఫాను సమయంలో, సాంకేతికత-ఆధారిత, డేటా-డ్రివెన్ రియల్-టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ వల్ల కచ్చితమైన అంచనాలు రూపొందించాం. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాం. పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా 700కు పైగా పౌర సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చాం. భవిష్యత్ సవాళ్లను అధిగమించేలా… యువత నైపుణ్యం సాధించేలా విదా సంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం కలిసి పరస్పరం సహకరించుకోవాలి. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను స్థాపించాం. ప్రపంచ మార్పులకు అనుగుణంగా మార్పులు ఉండాలి. ప్రస్తుతం కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సరిపోదు… “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సరంలోనే 120 బిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ద్వారా దేశ లక్ష్యాలను కూడా ఏపీ పంచుకుంటోంది. కొత్త రాజధాని నగరం అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీ నమూనాగా రూపొందించామని సీఎం వివరించారు.
క్లైమేట్ చేంజ్ ప్రపంచానికి అతిపెద్ద సవాలు
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు దేశాలను, పౌరులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ అంశాన్ని దీర్ఘకాలంలో పరిష్కరించుకునే సమయం మనకు లేదు. అత్యవసరంగా అన్ని దేశాలూ పనిచేయాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ప్రతికూల వాతావరణాలతో పెనుముప్పు ఎదుర్కొనక ముందే మనం మేల్కోవాల్సి ఉంది. వసుధైక కుటుంబకం అనే భారతీయ భావనతో దేశాలన్నీ కలసి పనిచేయాలి. దేశాలు, భాషలు, సంప్రదాయాలు వేరైనా అంతా కలిసి భూమిపైనే నివసిస్తున్నాం. భవిష్యత్ తరాలకు మెరుగైన పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దీనికి ప్రభుత్వాలు.. ప్రైవేటు రంగమూ కలిసి పనిచేయాలి. అప్పుడే భావితరం సురక్షితం అవుతుంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి, డాక్టర్ కృష్ణప్రసాద్ చిగురుపాటి, ల్డ్, హర్ష్ బీనా ఝవేరీ లకు ప్రొఫెసర్ పీటర్ బోన్ ఫీల్డ్, హర్ష్ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.












