- పురుషుల్లో డయాబెటిస్ సమస్య పక్కువ
- జిల్లాలవారీ హెల్త్ రిపోర్టులపై సీఎం ప్రజెంటేషన్
- హెల్దీ.. వెల్దీ.. హ్యాపీ ఏపీ సాధనకే ఈ ప్రయత్నం
- జూన్ నాటికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేస్తాం
- జీవనశైలి మార్పుతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
- ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉంది: సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): జిల్లాలవారీగా హెల్త్ రిపోర్టులను సోమవారం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని రూపొందించాలన్నది తమ ఆలోచన అన్న సీఎం…హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులపై సీఎం ఇచ్చిన ప్రజంటేషన్ వివరాలు..
మహిళల్లోనే హైపర్ టెన్షన్ ఎక్కువ
‘హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్‌లు, గుండె వ్యాధుల విషయంలో… తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జీవన విధానంవల్ల వ్యాప్తిచెందే వ్యాధులు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్నాయి. వాయ కాలుష్యం, స్మోకింగ్‌వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియో, సీఓపీడీ కేసులు ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియావంటి వ్యాధులు శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో ఎక్కువుగా నమోదవుతున్నట్టు గుర్తించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్, తాగునీటిలో టాక్సిన్స్‌తో అనారోగ్యం బారినపడ్డ వాళ్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువుగా ఉన్నారు. పొగాకు ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ రోగులు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు. అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్‌న్యూట్రిషియన్ సమస్యలతో బాధపడేవారు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు, డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో ఎక్కువ. వర్షాకాలంలో ఎక్కువుగా వచ్చే చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ సమాచారం గత ఐదేళ్లు ఆసుపత్రులకు వచ్చిన సమాచారాన్నంతా తీసుకుని రూపొందించాం. దీనిపై మాకు రికార్డులు ఉన్నాయి. వెనకబడిన జిల్లాల్లో ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల డయాబెటిస్ తక్కువగా ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
హైపర్ టెన్షన్
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్లు (మొత్తం జనాభాలో 52.43 శాతం) మందికి స్క్రీనింగ్ చేస్తే అందులో 19.78 లక్షల మందికి (9.2 శాతం) హైపర్ టెన్షన్ నిర్ధారణ అయ్యింది. వీరిలో మగవారికన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్ ఎదుర్కొంటున్నారు.
11,40,772 మంది మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది.
8,37,927 మంది మగవాళ్లకు హైపర్ టెన్షన్ ఉంది.
మరో 14.29 లక్షల మంది (71.92శాతం) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు.
జిల్లాల వారీగా చూస్తే… కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు హైపర్ టెన్షన్ ఎక్కువుగా ఉంది.
శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
డయాబెటిస్:
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసుకన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్ల (52.43శాతం) మందిని పరీక్షించగా వారిలో 11.13 లక్షల మందికి అంటే జనాభాలో 5.1 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు తేలింది.
డయాబెటిస్ మాత్రం మహిళలు కన్నా, మగవాళ్లకే ఎక్కువ.
5,61,196 మంది మగవాళ్లకు డయాబెటిస్ ఉంది.
5,52,767 మంది మహిళలకు డయాబెటిస్ ఉంది.
మరో 8.76 లక్షల మంది (78.73శాతం) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు. అంటే వీరంతా డయాబెటిస్ రిస్క్‌లో ఉన్నారు.
జిల్లాల వారీగా చూస్తే… గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజలకు డయాబెటిస్ ఎక్కువుగా ఉంది.
అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
డయాబెటిస్, హైపర్ టెన్షన్
హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్న వారి సంఖ్య 20.78 లక్షల మంది (9.6శాతం).
వీరిలో మగవారికన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఎదుర్కొంటున్నారు.
11,22,800 మంది మహిళలకు హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉంది.
మగవారికి వచ్చేసరికి 9,54,707 మందికి డయాబెటిస్ ఉంది.
అండర్ ఫాలో అప్ కేటగిరీలో మరో 12.80 లక్షల మంది (61.64శాతం) ఉన్నారు.
హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్నవాళ్లు ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా జిల్లాల్లో ఎక్కువ.
అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు.
గుండె సంబంధిత వ్యాధులు
2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 1,61,734 మంది కాగా, మహిళలు 99,366 మంది ఉన్నారు.
ఎన్టీఆర్, నంద్యాల, గుంటూరు జిల్లాలో గుండె వ్యాధిగ్రస్తులు అధికం.
అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పం.
క్యాన్సర్ రోగులు
రాష్ట్రంలో 1,19,397 మంది క్యాన్సర్ రోగులున్నారు.
వీరిలో మగవాళ్లు 46,872 మంది, మహిళలు 72,525 మంది ఉన్నారు.
కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ సమస్య అత్యధికం
అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పం.
కాలేయ వ్యాధిగ్రస్తులు:
30,646 మంది కాలేయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో మగవాళ్లు 21,740 మంది, మహిళలు 8,906 మంది.
నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో అత్యధికం
అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పం.
శ్వాస సంబంధిత రోగులు
రాష్ట్రంలో 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వీరిలో మగవాళ్లు 35,088 మంది కాగా, మహిళలు 19,274 మంది ఉన్నారు.
నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికం.
అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.
నరాల సంబంధిత అనారోగ్యం:
1,07,433 మంది నరాల సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వీరిలో మగవాళ్లు 63,698 మంది కాగా, మహిళలు 43,735 మంది ఉన్నారు.
విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికం.
అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు
రాష్ట్రంలో మొత్తం 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
వీరిలో మగవాళ్లు 1,22,672 మంది కాగా, మహిళలు 50,807 మంది ఉన్నారు.
నీళ్లు, లిక్కర్, పొగాకు కారణంగా ఈ సమస్య ఉంది.
శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కేసులు.
అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.
జూన్ నాటికి స్క్రీనింగ్ పూర్తి
‘ఈ ఏడాది జూన్ కల్లా రాష్ట్రంలో అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పూర్తి సమాచారాన్ని సేకరించడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా రోగాల బారినపడే అవకాశాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చని చెప్పడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దీనిపై మరింత అధ్యయనం, పరిశీలన, పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాల్సి ఉంది’ అని సీఎం చంద్రబాబు వివరించారు.