టిడిపి అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులకు ఇళ్లస్థలాలు మంజూరు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం నంద్యాల టుటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అమరావతిని ప్రధాన రాజధానిగా ప్రకటించినందున కర్నూలుకు ప్రత్యామ్నాయంగా న్యాయం చేయాలి. న్యాయవాదుల వృత్తినైపుణ్యతకు శిక్షణా వ్యవస్థను ఏర్పాటుచేయాలి. న్యాయవాదులపై భౌతిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణచట్టం తేవాలి.
న్యాయవాదుల ఆరోగ్యభద్రతకు హెల్త్ కార్డులతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. న్యాయవాదుల సంక్షేమనిధి నిబంధనలను సడలించాలి. న్యాయవాదులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి. జూనియర్ న్యాయవాదులకు గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి మాదిరి నమ్మించి మోసగించడం తెలుగుదేశం పార్టీ విధానం కాదు. కర్నూలులో హైకోర్టు అని చెప్పిన జగన్. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని అఫిడవిట్ ఇచ్చారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తానని నాలుగేళ్లలో ఒక్క ఇటుక అయినా జగన్ పెట్టారా? ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్ట పబ్బంగడుపుకోవడం జగన్ కు వెన్నతోపెట్టిన విద్య. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తాం. జూనియర్ న్యాయవాదులకు శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయాలు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అమలుచేస్తాం. న్యాయస్థానాలు, న్యాయవాదులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, దాడులకు పాల్పడే సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం అని లోకేష్ వెల్లడించారు.