జీరోనుంచి మొదలైంది లోకేష్ పొలిటికల్ జర్నీ. అతని ధృఢచిత్తమే హీరోయిజానికి చేర్చింది. నాయకుడు తయారవ్వడు. పరిస్థితులే నాయకుడిని తయారు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ కోసం లక్షలాదిగా నిలబడిన క్యాడర్ కోసం తానొక్కడుగా నిలబడాలన్న సంకల్ప బలమే `లోకేష్‌ను నాయకుడిని చేసింది. ప్రత్యేర్థుల పన్నాగాలను తిప్పికొడుతూ.. నమ్మి వెంట నడిచిన శ్రేణులను నిలబెట్టుకుంటూ.. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపునకు జెండా, అజెండా అయ్యాడు యువనేత లోకేష్. చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేసిన వైసీపీని దీటుగా ఎదుర్కొని అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన జనజేత `లోకేష్!
అమరావతి (చైతన్య రథం): ఎన్నో అవమానాలు.. మరెన్నో హేళనలు.. అడుగడుగునా జగన్ సర్కారు అరాచకాలకు ఎదురొడ్డి తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు యువనేత నారా లోకేష్. దాదాపు ఏడాదిన్నరపాటు యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండి, వారికి అండగా నిలించారు. జనం సమస్యలపై గళమెత్తి ప్రజాకంటక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు. ఫలితంగా 2024 ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. తండ్రినుంచి నేర్చుకున్న రాజకీయ పాఠాలకు, తాత ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన దూకుడును జోడిరచి.. రాక్షస ప్రభుత్వంపై దెబ్బతిన్న బెబ్బులిలా విరుచుకుపడ్డారు. తనపై వచ్చిన విమర్శలకు, హేళనలకు, అవమానాలకు అంతే దీటుగా సమాధానం చెప్పారు. తనని తాను నిరూపించుకుని తెలుగుదేశం పార్టీలో నవశకానికి నాంది పలికారు. టీడీపీ చారిత్రక విజయంలో చెరగని ముద్ర వేసిన లోకేష్… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్ధతగల కార్యదక్షుడు. కీలక సమయాల్లో పార్టీకి అన్నీ తానై వ్యవహరించి కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నారా లోకేష్ వైసీపీ నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు. ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు ఆయనపై దుష్ప్రచారం చేస్తూ అన్నివిధాలా కుట్రలు పన్నారు. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తానేంటో నిరూపించుకున్నారు. పార్టీ కార్యకర్తలకు బీమా, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీవంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని భయపడిన ప్రత్యర్థులు మానసికంగా దెబ్బతీసే చర్యలకు తెరతీశాయి. ప్రణాళికాబద్ధంగా ఆయనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేశారు. అన్నింటినీ దీటుగా ఎదుర్కొని అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించిన దమ్మున్ననేత లోకేష్.
పడిలేచిన కెరటంలా యువనేత పోరాటం
నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర ద్వారా ప్రజానేతగా ఎదిగారు. తాను ఎదగడమే కాదు.. పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. భవిష్యత్ నాయకుడిగా పార్టీలోను, ప్రజలలోనూ నమ్మకాన్ని కలిగించారు. తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్నీ పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుళ్యంలోనూ కలిగించారు. సమర్థవంతమైన నాయకత్వ పటిమతో ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా తాను ఎదగడం మాత్రమే కాదు.. పార్టీని విజయతీరాలకు చేర్చారు. యువగళం పాదయాత్రతో ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ ప్రజలమధ్యే నిలిచారు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉన్నారు. రోజూ వేలాదిమంది ప్రజలు, పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి వారి సమస్యలను ఓపిగ్గా వినడం లోకేష్‌ను జనబాహుళ్యానికి దగ్గర చేశాయి. పాదయాత్రను హేళన చేసిన వారినుంచే నాయకుడంటే ఇలా ఉండాలని ప్రశంసలందుకున్నారు. ప్రత్యర్థులు ఎంత భయపెట్టినా, దుష్ప్రచారం చేసినా వెనకడుగు వేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా పడిలేచిన కెరటంలా ముందుకు సాగారు. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మలచుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో పరాజయం పాలైనా గత ఐదేళ్లుగా అక్కడే నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. పడిలేచిన కెరంటంలా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
పదునైన ప్రసంగాలతో రాజకీయ ప్రత్యర్థుల్లో వణుకు
యువగళం పాదయాత్ర సమయంలోనూ, తర్వాత శంఖారావం, యువతతో ముఖాముఖి కార్యక్రమాల్లో పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లోకేష్ పూర్తి విజయం సాధించారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల అవినీతి, అక్రమాలను తూర్పారబడుతూ దెబ్బతిన్న బెబ్బులి మాదిరి యువనేత చేసిన ఉత్సాహపూరిత ప్రసంగాలు యువతను ఆకర్షించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శాసనసభ్యులు యథేచ్చగా సాగించిన దోపిడీని వారి గడ్డపైనే ఆధారాలతో సహా ఎండగట్టారు. పుంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగిస్తున్న సమయంలో కొత్తపేటలో నిర్వహించిన బహిరంగసభలో పాపాల పెద్దిరెడ్డీ అంటూ లోకేష్ చేసిన సింహగర్జన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పోలీసులు అడుగడుగునా ఇబ్బందిపెడుతున్నారు. వారందరి పేర్లు నేను రాసుకున్నా. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపాల పెద్దిరెడ్డిని వదిలేది లేదంటూ తొడగొట్టి చేసిన హెచ్చరికలు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. అదేవిధంగా నెల్లూరులో మహిళలతో జరిగిన ‘మహాశక్తితో లోకేష్’ కార్యక్రమంలో యువనేత మాట్లాడుతూ ‘ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశంపార్టీ విజయదుందుభి మోగిస్తున్న వార్తలతోనే అసాంఘిక శక్తులు రాష్ట్రంనుంచి పరారవుతాయి. అధికారంలోకి వచ్చాక నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను. మహిళలను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. నిర్భయ చట్టాన్ని అమలుచేయడం ద్వారా పటిష్టమైన రక్షణ కల్పిస్తాం’ అని యువనేత ఇచ్చిన భరోసా మహిళలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. లోకేష్‌లోని పట్టుదల, తెగువను స్పూర్తిగా తీసుకున్న యువతలో ఆయనకు అనూహ్యంగా ఫాలోయింగ్ పెరిగింది. సినిమా యాక్టర్లకు మించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 226రోజులపాటు యువనేత పాదయాత్ర చేయగా, ప్రతిరోజూ 2వేలమంది వరకు యువత లోకేష్ సెల్ఫీల కోసం శిబిరాలవద్ద గంటల తరబడి వేచిచూశారు. సుదీర్ఘ పాదయాత్రలో లక్షలాదిమంది యువతీయువకులు ఆయనతో ఫోటోలు దిగారు. నెల్లూరులో ఒకేరోజు 2500మందికి పైగా యువతీ యువకులు లోకేష్‌తో సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ లోకేష్ చేసిన ఉత్తేజపూరిత ప్రసంగాలు యువతను ఆయన అభిమానులుగా మార్చాయి. రాష్ట్రవ్యాప్తంగా యువతలో లోకేష్ రగిల్చిన చైతన్యమే ఎన్నికల రణరంగంలో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసేలా చేసింది.