- రూ.733.91 కోట్ల విలువైన 3.59 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
- 96 శాతం రైతులకు 24 గంటల్లోనే నగదు
- యంత్రాంగానికి మంత్రి నాదెండ్ల అభినందన
ఏలూరు(చైతన్యరథం): రాష్ట్రంలో మొదటిగా ఏలూరు జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొను గోళ్లు ప్రారంభమై అంచనాలకు మించి సేకరణ జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం సేకరణలో జిల్లా అధికారులు చూపిన చొరవను పౌరసరఫరాలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం ఏలూరు వచ్చిన ఆయన ధాన్యం సేక రణపై మీడియాతో మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో రూ.733.91 కోట్ల విలువైన 49, 022 మంది రైతుల నుంచి 3,58,924 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం భేషుగ్గా ఉందన్నారు. సంబంధిత రైతులకు నగదు చెల్లింపులు కూడా చేయడం అభినంద నీయమన్నారు. పౌరసరఫరాల రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ అంతకుమించి ధాన్యం కొనుగోలు చేయడంపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డిలను మంత్రి అభినందించారు. ధాన్యం కొనుగోలు విషయంలో వీరిద్దరి నేతృత్వంలో పౌర సరఫరాల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు. నాలుగేళ్ల అనంతరం రైతులు నిజమైన సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొను గోలు చాలా సమర్థవంతంగా జరిగిందన్నారు. ఏలూరు జిల్లాలో సుమారు మరో 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని, తప్పకుండా ప్రభుత్వం కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థ సారథి కూడా కలెక్టర్, జేసీలను అభినందించారు.