- ఉచిత విద్యుత్, రూ.25వేల ఆర్థిక సాయంతో ఊరట
- సీఎం చంద్రబాబుతో ముఖాముఖిలో చేనేత కుటుంబాలు
చీరాల (చైతన్యరథం): వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ ద్వారా కుప్పడం పట్టుచీరలకు మరింత విశిష్ట గుర్తింపు లభించిందని, జీఐ ట్యాగ్‌తో అమ్మకాలు 30శాతం మేర పెరిగాయని చేనేత కుటుంబాలు సీఎం చంద్రబాబుతో అన్నారు. గత ఏడాది చీరాలలో తయారైన కుప్పడం పట్టుతో పాటు అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘నేతన్న సేవలో’ పథకాన్ని చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ప్రారంభించారు. ఆ గ్రామంలోని ఓ చేనేత మగ్గం యూనిట్‌ను సందర్శించారు. చేనేత మగ్గం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రికి చేనేత యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. అనంతరం చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. కుప్పడం పట్టు చీరల ప్రత్యేకత, సంప్రదాయ నేత వృత్తి నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై వారితో చర్చించారు.
ప్రభుత్వ సాయం మాకు కొండంత అండ: చేనేత కార్మికులు
చేనేతల జీవనోపాధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై చేనేత వర్క్‌షాప్‌లోని కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వర్క్‌షాప్ ఏర్పాటుకు దారితీసిన ఆలోచన, యూనిట్ స్థాపన, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించి తీర్చిదిద్దిన తీరు, యూనిట్‌ను సమర్ధంగా నడిపిస్తున్న అంశాన్ని వారు సీఎంకు వివరించారు. ముందుగా కంచి బోర్డర్ చీరల తయారీదారు బత్తా ధనుంజయరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కుటుంబ పరిస్థితులు, చేనేత వృత్తి, ఉత్పత్తి వ్యయం, ఆదాయం, మార్కెటింగ్, విక్రయాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎంతో ఉపయోగపడుతోందని, రూ.25వేల ఆర్థిక సాయం తమకు ప్రోత్సాహంగా ఉంటోందని వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి బండారు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి వర్క్‌షాప్‌లోని తొలి అంతస్తును పరిశీలించారు.
భవనాన్ని విస్తరించి మరిన్ని మగ్గాలు ఏర్పాటు చేసి మరింత మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ప్రణాళికలను ఆయన సీఎంకు వివరించారు. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన విస్తరణ పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం వర్క్‌షాప్‌లో పని చేస్తున్న ఇతర చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. బొడ్డు అరుణ అనే మహిళ మగ్గంపై చీర నేస్తున్న తీరును సీఎం ఆసక్తిగా పరిశీలించారు. ప్రభుత్వం అందించిన రూ.25వేల ఆర్థిక సాయం తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యిందని మొబైల్ ఫోన్లలో వచ్చిన సంక్షిప్త సందేశాన్ని కార్మికులు ముఖ్యమంత్రికి చూపించారు. ప్రభుత్వ సహకారంతో తమ జీవనోపాధికి భరోసా లభించిందని చేనేతలు సంతోషం వ్యక్తం చేశారు.














