దానికి కొన్ని పరిమితులున్నాయి
భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు
సద్విమర్శలను స్వాగతిస్తాం… హత్యా బెదిరింపులను సహించబోము
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ సందేశం
అమరావతి (చైతన్య రథం): ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని, అయితే సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వాక్ స్వాతంత్య్రం అనేది అపరిమితమైన హక్కు కాదని, దానికీ కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు. ఇతరుల హక్కులను కాలరాసే హక్కు దానికి లేదన్నారు. సోషల్ మీడియాలో మత విశ్వాసాలను గాయపరచడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, హత్యా బెదిరింపులకు పాల్పడడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం అవసరమైతే కొత్త చట్టాలు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. వాక్ స్వాతంత్య్రం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో సందేశమిచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… “సోషల్ మీడియా ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానమవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును నేను గౌరవిస్తాను… మా ప్రభుత్వం గౌరవిస్తుంది. కానీ వాక్ స్వాతంత్య్రం ముసుగులో ఇతరుల హక్కులకు భంగం వాటిల్లితే చట్టపరమైన పరిణామాలు తప్పవు అని హెచ్చరించారు.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజా శాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూజ్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది. మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం… దాన్ని మేము స్వాగతిస్తాము. కానీ ఒకరిని తిట్టడం, హత్యా బెదిరింపులకు పాల్పడడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం… ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు” అన్నారు.
ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని అరాచకాలా?
గత కొన్ని ఏళ్లుగా సోషల్ మీడియాను కొందరు తప్పుడు పనులకు వాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని అసభ్యంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా తిట్టడం, పరువు తీయడం, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎక్కువైపోయింది. అబద్ధపు ప్రచారాలు చేయడం, ఫోటోలను అసభ్యంగా మార్చడం, భయపెట్టడం వంటి పనులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ చండాలమైన పోస్టులు పెడుతున్నారు. దేవుళ్లు, దేవతలపై కావాలనే అవమానకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పనులను భావ ప్రకటన స్వేచ్ఛ అనరు. ఇది మంచి విమర్శ కాదు, ప్రజాస్వామ్యం అసలే కాదు. తప్పులను ఎత్తిచూపడం, సరదాగా సెటైర్లు వేయడం, సొంత అభిప్రాయాలను చెప్పే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాము. కానీ కావాలనే అబద్ధాలు ప్రచారం చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాణాలతో చెలగాటం ఆడుతామని బెదిరించడం, ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడడం, ఒకరి పరువు తీయాలని చూడడం… ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావు. వీటిని ఏమాత్రం సమర్థించలేము అని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
నేరానికి కులం, మతం, ప్రాంతం, పార్టీ లేదు
నేరానికి కులం, మతం, లేదా రాజకీయ పార్టీ అనే తేడాలు ఉండవు. తప్పు చేసిన తర్వాత కులం వెనుకో, మతం వెనుకో, ప్రాంతం లేదా రాజకీయ పార్టీల వెనుకో దాక్కోవాలని ఎవరూ ప్రయత్నించవద్దు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వేధింపులు, దూషణల వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులందరికీ నేను ఒకే మాట చెబుతున్నాను… మీరు అస్సలు ఒంటరివారు కాదు. ఈ ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది. మీ సమస్యలపై ఫిర్యాదులు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. వేధింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు, లింక్‌లు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో మీరు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి నిజమైన ఫిర్యాదును మేమే స్వయంగా పరిశీలించి, అధికారుల ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాము. అలాగే, పదేపదే ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాను పాడుచేస్తున్న వారిని గుర్తించి, వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని బాధ్యతగల పౌరులందరినీ కోరుతున్నాను. సమాజాన్ని పాడుచేసే ఇలాంటి వారిని అడ్డుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు… మనందరి ఉమ్మడి బాధ్యత అని పవన్ పేర్కొన్నారు.
అవసరమైతే కొత్త చట్టాలు తీసుకొస్తాం
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు పాల్పడ్డవారిపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, సమాచార సాంకేతిక చట్టం – 2000తోపాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కొత్త చట్టాన్ని తీసుకురావడానికీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాము. సైబర్ క్రైమ్ పోలీసులు, న్యాయ రక్షణ సంస్థలతో కలిసి పనిచేస్తూ.. సోషల్ మీడియా నేరాలపై చాలా వేగంగా యాక్షన్ తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు.
తప్పుడు పోస్టులను ఫార్వార్డ్ చేయకండి
ప్రతి పౌరుడికి నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఫేక్ అకౌంట్లు, చంపేస్తామనే బెదిరింపులు, మహిళలపై అసభ్యకరమైన పోస్టులు, మతాలను అవమానించే తప్పుడు సమాచారం లాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ మీకు కనిపిస్తే.. వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయకండి, లైకులు-షేర్లతో ప్రమోట్ చేయకండి. అదే సమయంలో, రాజ్యాంగం మనకు కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను మేము పూర్తిగా కాపాడతాము. అయితే మన మాటల్లో బాధ్యత, మన భాషలో గౌరవం, మన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా అనేది మనుషులను కలిపే వేదిక కావాలి కానీ, విడదీసేది కాకూడదు. మమ్మల్ని నిరభ్యంతరంగా ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాలను చెప్పండి. కానీ ఎదుటివారికి గౌరవం ఇస్తూ, బాధ్యతతో, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది” అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.















