- రైతుబజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు కౌంటర్ ప్రారంభించిన మంత్రి
- రాబోయే రోజుల్లో పంచదార, చిరుధాన్యాలు, రాగిపిండి కూడా రాయితీ ధరకు
అమరావతి(చైతన్యరథం): రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణ పూర్తి అయ్యాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో అన్యాయం జరగకూడదని.. పీడీయస్ బియ్యం పేదలకే అందాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ చేసే మొదటి కౌంటర్‌ను నాదెండ్ల మనోహర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పౌరసరఫరాలశాఖ, కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ… ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోల్ సేల్ దుకాణదారులు, రిటైల్ వర్తకులు కూడా రూ.160కే నాణ్యమైన కిలో కందిపప్పును అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు బజార్లలో ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం చొప్పున అందిస్తామన్నారు. ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. 784 రైతు బజార్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. రైతు బజారే కాదు.. అన్ని పెద్ద మాల్స్‌లో కూడా కందిపప్పు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతు బజార్లలో మిల్లెట్స్, పంచదార, రాగి పిండి, తక్కువకు ఇస్తామని తెలిపారు. బియ్యం కూడా బయటి మార్కెట్ కన్నా తక్కువకే ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుకు, వినియోగదారులకి మేలు జరగాలనేది మా ఆకాంక్ష అని మంత్రి అన్నారు.
ఇటీవల రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలులో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 36 వేల కోట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుని ఏమి చేసిందో తెలియదన్నారు. రైతులకు రూ.1600 కోట్లు బకాయి పెట్టి వెళ్లారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో వెయ్యి కోట్లు రైతులకు ఇచ్చామని తెలిపారు. మిగిలిన ఆరు వందల కోట్లు త్వరలో ఇస్తామని వెల్లడిరచారు. ఇటీవల ధరల గురించి సీఎం సమక్షంలో సమీక్ష జరిగిందని.. ధరల స్థిరీకరణపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రణ చేస్తున్నామన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు.