- పోసాని వాంగ్మూలంతో మొదలైన వణుకు
- ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు
అమరావతి (చైతన్యరథం): వైసీపీ హయాంలో తెర వెనుకనుండి అన్ని వ్యవహారాలను నడిపించి, సకల శాఖల మంత్రిగా ముద్రపడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారు. అప్పట్లో సకల శాఖల, సకల పాపాల్లో భాగస్వామి అయిన సజ్జలకు నేడు అరెస్ట్ భయం పట్టుకుంది. అనేక సినిమాలకు మాటలు రాసిన స్క్రిప్ట్ రైటర్ పోసాని కృష్ణ మురళికి బూతుల స్క్రిప్ట్ రాసిచ్చి మీడియా ముందు చదివించిన సజ్జల రామకృష్ణారెడ్డి, దానిని సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఆయన తనయుడు భార్గవరెడ్డి.. తమ పేర్లు బయటకు రావటంతో అరెస్టు నుండి తప్పించుకునేందుకు హైకోర్టు మెట్లెక్కారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌లను దూషించిన కేసులో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు అయిన విషయం తెలిసిందే. విచారణలో సజ్జల రామకృష్ణా రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే తాను నడుచుకున్నానని పోసాని చెప్పారు. అంతేకాదు తాను మాట్లాడిన వీడియోలను సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి సోషల్‌మీడియాలో వైరల్ చేశారని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పీఎస్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17కుపైగా కేసులు నమోదయ్యాయి. పోసాని నేరాన్ని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వడంతో..సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదుచేసిన కేసులో తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని కోర్టును కోరారు.
వైసీపీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే పెద్దగా పట్టించుకోని వైసీపీ నేతలు, పోసానిని అరెస్ట్ చేస్తే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారో స్పష్టమవుతోంది. వంద సినిమాలకు మాటలు రాసిన పోసానికి అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ వాడతగని అసభ్య పదజాలంతో తయారు చేసిన స్క్రిప్ట్ ఇచ్చి మీడియా ముందు మాట్లాడిరచింది సజ్జలే అనేది తేలిపోయింది. పార్టీ, ప్రభుత్వం అనే తేడా లేకుండా జనం డబ్బులతో జీతభత్యాలు తీసుకొంటూ సజ్జల చేసిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు ఒక్కో పాపపు పుట్ట పగులుతుంటే.. బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సజ్జల అండ్ సన్స్ పేర్లను పోసాని బయటపెట్టారు. ఒకవేళ పోలీసులు కస్టడీకి తీసుకొని గట్టిగా విచారిస్తే మరింకెందరి పేర్లు, ఇంకెన్ని రహస్యాలు బయట పెట్టేస్తారో, పెడితే వైసీపీలో చాలా మంది చిక్కుల్లో పడతామనే ఆందోళన చెందుతున్నారు. పోసాని స్టేట్‌మెంట్ బయటకు రాగానే సజ్జల అండ్ సన్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడమే ఇందుకు నిదర్శనం.