- నేడు అనంతపురంలో కూటమి పార్టీల సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ
- హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్
- భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
- 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం
- 15 నెలల పాలనా విజయాలను ప్రజలకు వివరించనున్న నేతలు
- సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు
అనంతపురం (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తొలిసారి రాష్ట్రంలోని మూడు ఎన్డీఏ పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట -బుధవారం నిర్వహిస్తున్న ఈ భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ, భారీస్థాయిలో పెట్టుబడులను రప్పిస్తూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తున్న కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సూపర్ సిక్స్- సూపర్ హిట్ పేరుతో ఈ సభనిర్వహిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కావటంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఎన్టీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరు కానున్నారు.
బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి రాజకీయ సభ కావటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించటంపై ఈ సభలో ప్రధానంగా మూడు పార్టీల నేతలు ప్రస్తావించనున్నారు. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టు ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనున్న అంశాలను ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించనుంది.
సూపర్ సిక్స్ పథకాల చిహ్నంతో వేదిక
కూటమి సర్కారు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన భారీ ఎస్ఈడీ స్క్రీన్ తో వేదికను తీర్చిదిద్దారు. 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసీనులయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహిస్తున్న 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట జెండాలను, హెూర్డింగ్ లను ఏర్పాటు చేశారు. ఇక వేదిక ప్రాంగణానికి దారితీసే మార్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, తదితరుల ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అనంతపురంలోని ప్రధాన కూడళ్లతో పాటు దారి పొడవునా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన జెండాలు, తోరణాలతో సభకు వచ్చేవారిని ఆహ్వానించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు. మూడు పార్టీల తరపున ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో అనంతపురంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే భారీస్థాయిలో జనం తరలిరానున్న నేపథ్యంలో తాగునీరు, భోజనాలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడే ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ఎన్డీఏ పార్టీల ఐక్యతా నినాదం
ఎన్నికలకు ముందు నుంచి కలసికట్టుగా ఉన్న మూడు పార్టీలు.. అధికారంలోకి వచ్చాక కూడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యంగానే ముందుకు వెళ్తున్నాయి. 15 నెలల పాలనా కాలంలో సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-మంత్రి లోకేష్-బీజేపీ అగ్ర నేతలు అత్యంత సమన్వయంతో పని చేస్తున్నారు. అవసరమైన సమయాల్లో కేంద్రంతో, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం.. ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం నినాదాన్ని మరింత బలంగా ఈ వేదిక ద్వారా పంపాలని కూటమి భావిస్తోంది. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్ సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, నారాయణ, తదితరులు మంగళవారం పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత
సూపర్ సిక్స్ -సూపర్ హిట్ విజయోత్సవ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రామన్నందున భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉండకూడదని అధికారులను హెూంమంత్రి ఆదేశించారు. డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, సభా వేదిక ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్ వ్యవస్థ ద్వారా తొలిసారిగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. 6 వేల మంది పోలీసులతో సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మాజీ సీఎం జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని.. అంతేగానీ తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తిగా యంత్రించామన్నారు.
మంత్రుల సమీక్ష
సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయయోత్సవ సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపు ఇచ్చారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, తదితరులు సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. సీఎం చంద్రబాబు హెలీప్యాడ్ గురించి, లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు భోజన వసతులు, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, నాయకులు అధికారులు పాల్గొన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు త్వరలోనే చట్టం రాబోతోందని మంత్రి పేర్కొన్నారు. ఫేక్ ప్రచారాలు చేసే వారిని కచ్చితంగా నియంత్రిస్తామన్నారు. అనంతరం, పార్కింగ్ ప్రదేశాలతోపాటు వీఐపీల భద్రతా ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, సభ కారణంగా ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమష్టిగా పనిచేసి సక్సెస్ చేయండి: మంత్రుల పిలుపు
అనంతపురంలో నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్కు తరలివచ్చే ప్రజలు, మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం, తాగునీరు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని పార్టీ నాయకులకు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అనంతపురం సభ ఏర్పాట్లపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మండలాల వారీగా టీడీపీ నేతలతో చర్చించారు. -బహిరంగ సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మున్సిపాలిటీకి ఇప్పటికే 480 బస్సులు కేటాయించామని, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఇంకా అవసరమైన వాహనాలను సమకూరుస్తారని మంత్రులు తెలిపారు. ప్రతీ వాహనంలో అవసరమైన తాగు నీరు, భోజనం, బిస్కెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు ఉదయం11 గంటలకే వాహనాలు బయలుదేరి సభా వేదికకు చేరుకునేలా చూడాలని పేర్కొన్నారు. సభకు వచ్చిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకువెళ్లే బాధ్యతను నాయకులు చూసుకోవాలన్నారు. సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుల్లా చైతన్యరెడ్డి, నియోజకవర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు.