అమరావతి, చైతన్యరథం: సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) నోటీసులు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభల్లో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈనెల ఐదో తేదీన సీఈవోకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆధారాలతో సహా పెన్‌డ్రైవ్‌లో సమర్పించారు. వీటిని పరిశీలించిన సీఈవో ఆ వ్యాఖ్యలు ప్రాధమికంగా కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని భావించి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని సిఎం జగన్‌కు నోటీసులు పంపారు. ఒక వేళ ఈ సమయంలోపు స్పందించకుంటే సరైన చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదును పంపిస్తామని పేర్కొన్నారు.
చంద్రబాబుపై సిఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు….
ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభల్లో సిఎం జగన్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ తేదీన ఏవిధమైన వ్యాఖ్యలు చేశారో వీడియోలతో సహా పెన్‌డ్రైవ్‌లో ఆధారాలను వర్ల రామయ్య సీఈవోకు అందించారు. ఈనెల మూడో తేదీన పూతలపట్టు సిద్దం సభలో సిఎం జగన్ చంద్రబాబును ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్న వ్యక్తి అని దూషించారు. ఈనెల రెండో తేదీన మదనపల్లె సిద్ధం సభలో మాట్లాడుతూ అరుంధుతి సినిమాలో పశుపతి సమాధి నుండి లేచివచ్చినట్లు ఐదేళ్ల తర్వాత పసుపుపతి చంద్రబాబు పేదల రక్తం పీల్చుకుతాగేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి వదల బొమ్మాళీ వదలా అంటూ కేకలు పెడుతూ వస్తున్నాడని వ్యక్తిగతంగా దూషించారు. ఈనెల మూడో తేదీన పూతల పట్టు సభలో సిఎం జగన్ మాట్లాడుతూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు మనిషా లేక శాడిస్టా అని ఈ సందర్భంగా అడుగుతున్నా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా నాలుగోతేదీన నాయుడపేట సిద్దం సభలో సిఎం జగన్ మాట్లాడుతూ 31 మంది అవ్వాతాతలను చంపిన చంద్రబాబును హంతకుడు అందామా లేక అంతకన్నా పెద్ద పదమేదైనా ఉంటే అందామా అని ఆలోచన చేయమని కోరుతున్నా అని అన్నారు. ఈనెల మూడో తేదీన పూతలపట్టు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకా లకా అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల విధానాలు, వారి కార్యక్రమం, పాత రికార్డు, వారి పని విధానంపైనే విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయకూడదు. కానీ సిఎం జగన్ మాత్రం సిఎం పదవికి కూడా మచ్చ తెచ్చేలా ఇష్టానుసారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రాధమికంగా ఈ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని భావించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నోటీసులు జారీ చేశారు.