- గూగుల్ ఎంత ముఖ్యమో ఎసఎంఈ కంపెనీలు కూడా అంతే ముఖ్యం
- రాష్ట్రంలో మూడు ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తున్నాం
- డేటా సెంటర్లపై ఉన్న భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉంది
- అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం
- ముంబయి బ్యాంక్ ఆఫ్ అమెరికా కాన్ఫరెన్స్‌లో మంత్రి లోకేష్
ముంబయి: సమర్ధ నాయకత్వం, స్పీడ్… ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ముంబయిలో ‘అభివృద్ధికి కొత్త సరిహద్దులు (New Frontiers of
Growth) పేరుతో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని భవిష్యత్‌కు సిద్ధం చేయడం-ఆంధ్రప్రదేశ్ అనుభవం (Future Readying India -The Andhra Experience) అనే థీమ్‌పై నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్‌లో మంత్రి లోకేష్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా కంట్రీ ఎగ్జిక్యూటివ్ ఇండియా సీఈవో విక్రమ్ సాహు వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ‘కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. నగరాలను నిర్మించడంలో, ఎకో సిస్టమ్ లను అభివృద్ధి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు ఏపీలో మళ్లీ చేస్తున్నారు.
రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను తీసుకువచ్చాం. ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ ను మేము కేవలం 17 నెలల్లోనే ప్రారంభించగలిగాం. ఇది గ్రీన్ స్టీల్ రంగంలో భారతదేశంలోనే అతి పెద్ద ఎఫ్‌డీఐ పెట్టుబడుల్లో ఒకటి కాబోతోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనల్ని ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది.
మూడోది ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో పెట్టుబడులను విజయవంతంగా రాబడుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశానికి డేటా సెంటర్ పెట్టుబడులను తీసుకురావడానికి మేం పర్మినెంట్ ఎస్టాబ్లిష్మెంట్, దానికి సంబంధించిన పన్ను నిబంధనలను మార్చాల్సి వచ్చింది. కేంద్రం సహకరించింది. డేటా సెంటర్ వచ్చింది.
ఏఐలో టాప్‌లో ఉండాలని..
ఏఐలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబునాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో మొదటి వరుసలో ఉన్నది గూగుల్. 13 నెలల్లోనే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. పాలసీ, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, భూమిని గుర్తించడంలో అంతా కలిసి పనిచేశాం. స్థానిక ప్రజలను ఒప్పించడంతో వారూ సహకరించారు.
డేటా సెంటర్లతో అనుబంధ పరిశ్రమలొస్తాయి
డేటా సెంటర్ల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగ కల్పన జరుగుతుంది. విశాఖపట్నంలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఏఐ, ఐటీ ఎకోసిస్టమ్‌ను నిర్మించవచ్చు. పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్ అనుబంధ సంస్థలకు అవకాశాలు పెరుగుతాయి. అందుకే నేను గూగుల్, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న మరికొన్ని భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ పూర్తి ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి కృషి చేస్తున్నాను.
ఎంఎసఎంఈలూ ముఖ్యం
నేను అనుసరించే Speed, Simplification, Stability మా విజయానికి సూత్రాలు. గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఎంత ముఖ్యమో ఎంఎసఎంఈ కంపెనీలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అవి క్షేత్రస్థాయిలో అధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తాయి. మా ఎంఎసఎంఈలూ మంత్రి నాయకత్వంలో మేం ఇప్పుడు డీమ్డ్ పర్మిషన్స్ విధానాన్ని పరిశీలిస్తున్నాం. దీని ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు,
అందరి సహకారంతో…
ఒక ప్రాజెక్టు కోసం భూమిని సేకరించేటప్పుడు దాని వల్ల వచ్చే ప్రయోజనాలు, అక్కడ నిర్మించబోయే ఎకో సిస్టమ్, భూ యజమానుల కుటుంబాలకు లభించే ఉద్యోగావకాశాల గురించి వివరించాలి. మూడోది భూమికి సరైన నష్టపరిహారం, పారదర్శకమైన నమూనా ఉండాలి. 1995 నుంచీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దీనిని చేసి చూపించింది. కాబట్టి ప్రజలకు మాపై నమ్మకం ఉంది. నమ్మకం లేకపోతే విజయం సాధించలేం. ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టు కోసం 3వేల ఎకరాలు, 660 కుటుంబాలు ఉన్నాయి. కానీ మేం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో వారు ఎటువంటి సమస్యలు లేకుండా భూములు ఇచ్చారు.
డేటా సెంటర్లపై అపోహలు తొలగించాలి
డేటా సెంటర్ల విషయానికొస్తే రెండు భిన్నమైన తీవ్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. డేటా సెంటర్లు మంచివని కొందరు, చెడ్డవని కొందరు అంటారు. కాబట్టి అవి మంచివి కావని నమ్మే వారితో మాట్లాడ్డం ముఖ్యం. ఉదాహరణకు… మన దేశంలో వన్ నేషన్ వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు. అమెరికా మనకు నమూనా కాదు. నీటి విషయానికి వస్తే.. ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం నీటి వినియోగంతో సమానం. మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం ఒక టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్.. ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలను మాట్లాడటం.. వారి భయాలను తొలగించడం ముఖ్యం. ఆ డేటా సెంటర్లు వచ్చే ఆ ప్రాంత ఎంపీ స్వయంగా యువతను కలిసి ఓపెన్ చాట్ చేస్తున్నారు. అవసరమైతే జోనింగ్ నిబంధనలను మరింత సవరించడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం. భారతదేశానికి ఇది మరింత ముఖ్యం. ఎందుకంటే మనం ఐటీ విప్లవం ద్వారా ఎంతో లబ్ధి పొందాం. కొన్ని ఉద్యోగాలు మారతాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
ఉద్యోగాలు కల్పించే యువతను తయారు చేస్తాం
ఏఐని ఉపయోగిస్తూ నైపుణ్యాలను పెంచుకుని రీసెర్చ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది మన కరిక్యులమ్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్ వంటి తదుపరి తరం సాంకేతికతలకు అనుగుణంగా మార్చాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ విజన్ ఉంది. అందుకే ఆయన నాకు అటు విద్య, ఇటు ఐటీ శాఖలు రెండింటినీ ఇచ్చి వాటిని అనుసంధానించమన్నారు. కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారు మాత్రమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువతను తయారు చేయడమే మా లక్ష్యం.
వేగంగా పనిచేసే రాష్ట్రాలకే కేంద్రం మద్దతు ఇస్తుంది
విధానాల రూపకల్పన ఢిల్లీలో జరిగితే అమలు మాత్రం గల్లీల్లో జరుగుతుంది. అమలు అనేది రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, వారి బృందాల బాధ్యత. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన విధానాలను రూపొందిస్తోంది. కానీ రాష్ట్రాలు వాటిని సొంతం చేసుకుని అమలు చేయాలి. కొన్ని రాష్ట్రాలు మిగతా వాటి కంటే బాగా చేస్తున్నాయి. ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన ఏఎంసీఏ ప్రాజెక్టు గురించి మాకు 2025 ఫిబ్రవరి, మార్చిలోనే తెలిసింది. నేను రక్షణ మంత్రిని కలిసి లేఖ ఇచ్చాను. ఆ ప్రాజెక్టు గురించి మాకెలా తెలిసిందో చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మేం దానిని నిరంతరం ఫాలో అప్ చేశాము. ఒకసారి ఆయన సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి.. మేం సిద్ధంగా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందా అని అడిగారు. కేవలం 36 రోజుల్లో పుట్టపర్తిలో 600 ఎకరాల భూమి సేకరించి భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించాం. కేంద్ర ప్రభుత్వం ఆశించే వేగం అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రాష్ట్రానికే మద్దతు ఇస్తోందనే వార్తలు పూర్తిగా అవాస్తవం. వేగంగా పనిచేసే రాష్ట్రాలకే కేంద్రం మద్దతు ఇస్తుంది.
20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం
మేము కేవలం పెట్టుబడుల గురించే కాదు పాలసీలపై ఓపెన్ ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తాం. ఉద్యోగాలను సృష్టించే ఏ చట్టాన్నైనా మార్చడానికి, సంస్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉద్యోగాల కల్పనే ప్రజా ప్రభుత్వ ఏకైక ప్రాధాన్యత. ఏఐ, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇప్పుడు నిజం. కానీ ఉద్యోగాలను సృష్టించే రంగాలు చాలా ఉన్నాయి. మా లక్ష్యం ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలను సృష్టించడం. ఇదే గౌరవ ప్రధానమంత్రి ప్రాధాన్యత కూడా.
రాష్ట్రంలో మూడు ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ 22 క్లస్టర్లను నిర్మిస్తోంది. డేటా సెంటర్లు, ఫార్మా, మెడికల్ డివైసెస్, ఐటీ, కంప్రెస్డ్ బయో గ్యాస్, అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్, క్వాంటం కంప్యూటింగ్ నుంచి గ్లాస్ సిటీ, స్పేస్ సిటీ, డిఫెన్స్ సిటీ వరకు.. దాదాపు 150-200 కిలోమీటర్ల పరిధిలోనే పూర్తి తయారీ ఎకో సిస్టమ్ నిర్మించడమే మా లక్ష్యం. ఒక టీవీని అసెంబుల్ చేయడమే కాకుండా దానికి కావలసిన ప్లాస్టిక్ హౌసింగ్, థర్మాకోల్, మాన్యువల్స్ ప్రింట్ చేసే వారు కూడా అదే ఎకో సిస్టమ్‌లో భాగం కావాలి. దీన్ని మనం ఇతర దేశాల నుంచి నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే రెండో అతి పెద్ద తీర ప్రాంతం ఉంది. ఇది పోర్టుల అభివృద్ధికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు సమీపంలో ఉండటం వల్ల వాటి బలాన్ని ఉపయోగించుకుని కొత్త ఎకో సిస్టమ్‌లను నిర్మించడానికి సహాయపడుతుంది. గ్లాస్ సిటీ ఎందుకంటే… ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ వినియోగం పెరుగుతుంది. మన దగ్గర దానికి కావలసిన సిలికా లభిస్తుంది. స్పేస్ సిటీ ఎందుకంటే మనకు శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ ఉంది. ఉత్తరాంధ్రలో ఫార్మా ఎకో సిస్టమ్ ఉంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. కాబట్టి వాటిని మరింత రెట్టింపు చేస్తున్నాం. మేము కేవలం ఒకే నగరాన్ని కాకుండా మూడు ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తున్నాం.
ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి
చంద్రబాబునాయుడు సైబరాబాద్‌ను నిర్మించారు. ఈసారి అమరావతి నిర్మిస్తున్నారు. మొదటి దశలోనే రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించి పూర్తి గ్రీన్‌ఫీల్డ్ నగరాన్ని నిర్మిస్తున్నారు. విద్యా సంస్థలు, హాస్పిటాలిటీ, హాస్పిటల్స్, క్వాంటం కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్… అన్నీ ఈ కొత్త నగరంలోకి వస్తున్నాయి. దేశంలో ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడానికి జరుగుతున్న సరికొత్త ప్రయత్నం ఇది. 2019లో ప్రభుత్వం మారడం వల్ల ప్రాజెక్టు కొంచెం నెమ్మదించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో పనులు జరుగుతున్నాయి. 2028 నాటికి ప్రభుత్వ కోర్ సిద్ధమై దేశానికి అంకితం చేస్తాము. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి. బిట్స్ తమ క్వాంటం క్యాంపస్‌ను అమరావతిలో నిర్మిస్తోంది. ఇది 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే దేశం గెలుస్తుంది. రాజకీయాల్లో కూడా అనేక అవకాశాలున్నాయి. మనం ఆశించిన మార్పు కోసం యువత, మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.













