- సీఎస్‌గా బీసీ అధికారి విజయానంద్ నియామకం హర్షణీయం
- టీటీడీ ఈవో, డీజీపీ పదవుల్లోనూ బీసీ అధికారులే
- గత ప్రభుత్వంలో బీసీలకు అన్నింటా అన్యాయం
- రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని, గత ప్రభుత్వంలా మాటల ప్రభుత్వం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బీసీ వ్యక్తి అయిన విజయానంద్ నియామకం చంద్రబాబుకు, ఎన్డీయే ప్రభుత్వానికి బీసీలపై ఉన్న గౌరవాన్ని తెలియచేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీలపై దాడులు జరిగాయని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. గత ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్ర పాలనా వ్యవస్థకు అత్యంత కీలకమైన పభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో విజయానంద్‌ను, అదే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఈవోగా బీసీ వర్గాలకు చెందిన అధికారి శ్యామలారావును, డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించడం ఆ వర్గాల పక్షపాతిగా సీఎం చంద్రబాబు నిబద్ధతలను తెలియజేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం మున్ముందు బీసీలకు మేలు చేకూర్చే మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.