- ప్రజలివ్వని హోదా కావాలనడం వితండవాదం
అమరావతి (చైతన్యరథం): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం డ్రామాలు ఆడుతున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి అనగాని మాట్లాడుతూ జగన్‌కు కావాల్సింది ప్రతిపక్ష హోదానే కాని ప్రజా సమస్యలు మాత్రం ఆయనకు పట్టవని విమర్శించారు. శాసనసభ సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే సోమవారం జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారన్నారు. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా గతంలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ఏపీ అసెంబ్లీలోప్రజా సమస్యలను సమర్థవంతంగా లేవనెత్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తుచేశారు. అదేవిధంగా లోక్‌సభలో వాజ్‌పేయికి ప్రతిపక్ష నేత హోదా లేకున్నా దేశ సమస్యలను అర్ధవంతంగా సభ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. జగన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలను ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలివ్వని హోదాను జగన్ కోరుకోవడం ఆయన నియంత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. జగన్ రెడ్డికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నా, చట్ట నిబంధనలపై గౌరవం ఉన్నా శాసనసభా సమావేశాలకు హాజరయ్యేవారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.