గన్నవరం: ఆడవాళ్లంటే గౌరవంల లేని వల్లభనేని వంశీ లాంటి వారికి పొరపాటున కూడా ఓటేయ్యరాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం గన్నవరంలో జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ ప్రసంగిస్తూ, జనసేన మద్దతుదారులు పొరపాటును కూడా వల్లభనేని వంశీకి ఓటేయొద్దని, అతడు ఆడవాళ్లను అవమానించే వ్యక్తి అని వ్యాఖ్యానించారు. 2014లో నేను కూటమికి మద్దతు ఇచ్చినప్పుడు ఇక్కడ వల్లభనేని వంశీ ఏం చెప్పారో నాకు గుర్తుంది. మీరు ప్రచారం చేయడం వల్ల ఎప్పుడూ ఓట్లు పడని ప్రాంతాల్లో కూడా నాకు ఓట్లు పడ్డాయి అని వంశీ మనస్ఫూర్తిగా చెప్పారు. ఆయన మంచి నాయకుడు, ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి అనుకున్నాను… కానీ ఆ తర్వాత ఆయన మారిపోయారు. విభేదాలు ఎవరికుండవు? నేను కూడా చంద్రబాబుతో విభేదించాను, చింతమనేని ప్రభాకర్‌తో విభేదించాను. ఎక్కడా కూడా విధానపరంగానే విభేదించాం తప్ప, అంతకుమించి వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఎంపీ ఓటు బాలశౌరి(జనసేన)కి వేసి, ఎమ్మెల్యే ఓటు నాకు వేయండి అని వల్లభనేని వంశీ గన్నవరం ఓటర్లను అడుగుతున్నట్టు నాకు తెలిసింది. అయితే, ఓటర్లు ఆ అభ్యర్థనను పాటించకూడదు. జనసేన పార్టీ కూడా కూటమిలో ఉన్నందున అది సమంజసం కాదు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన పాటలను కూడా నేను నా సినిమాల్లో పెట్టుకున్నాను. కానీ, అటువంటి మహనీయుడి కుమార్తె (నారా భువనేశ్వరి) గురించి వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. చంద్రబాబుతో, లోకేశ్ తో విభేదాలు ఉండడం వేరు… కానీ భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడడం నాకు బాధ కలిగించింది. భువనేశ్వరిని అంటే నా సోదరిని అన్నట్టే. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ జనసేన. నాయకుల మధ్య ఎన్నో విభేదాలు ఉండొచ్చు… జగన్ తోనూ విభేదాలు ఉన్నాయి… కానీ వారి అర్ధాంగి గురించి మాత్రం ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. వల్లభనేని వంశీకి జనసేన మద్దతుదారులు ఓటేస్తే… స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, మన సోదరిని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకచోట ఆడవాళ్లను అగౌరవపరిచన వాళ్లు ఎక్కడైనా ఆడవాళ్లను అలాగే కించపరుస్తారు. అందుకే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యమని పవన్ కల్యాణ్ వివరించారు.