- ప్రజాదర్బార్’ కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా
- సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం
అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్నవారికి అండగా తానున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం ‘ప్రజాదర్బార్’ కు తరలివచ్చిన ప్రజలకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్‌ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని యువనేత హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకు నెలకు రూ.3వేల గౌరవ వేతనం ఇస్తున్నారని, దీనిని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచాలని కోరారు. పాఠశాలల్లో అదనంగా రాగిజావ, కోడిగుడ్లు ఉడకబెట్టేందుకు ఎలాంటి అదనపు వేతనం ఇవ్వడం లేదని, అందుకయ్యే గ్యాస్ కూడా తమ జీతం డబ్బుల నుంచే ఖర్చుపెట్టుకుని విద్యార్థులకు అందిస్తున్నామని వాపోయారు. జీతాలు సక్రమంగా అందడం లేదని, పని ఒత్తిడి కూడా అధికంగా ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తమ సమస్యలను వినేవారు కూడా కరువయ్యారని, కూటమి ప్రభుత్వం ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి ప్రజాదర్బార్‌కు వచ్చామన్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో ప్రస్తుతం విద్యార్థులకు అందించే మెనూను అడిగి తెలుసుకున్నారు. మెనూ ఏవిధంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడతారో వివరాలు ఇవ్వాలని తనను కలిసిన కార్మికులను కోరారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దివ్యాంగ పెన్షన్ అందించండి
దివ్యాంగులైన తమకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి మండలం చినకాకానికి చెందిన మంచాల సీతారామయ్య, ఓబులమ్మ దంపతులు లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్వర్ణకార చేతివృత్తిపై జీవనం సాగించే తాను అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితం అయ్యానని, పెన్షన్ మంజూరు చేయించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన బుట్టా పానకాలు కోరారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తెకు విదేశీ విద్య పథకం ద్వారా ఆర్థికసాయం చేయాలని ఉండవల్లికి చెందిన ఆలపాటి సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడైన తనకు నాలుగు చక్రాల మోటర్ సైకిల్ ఇప్పించి ఆదుకోవాలని తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఎస్.రమేష్ విన్నవించారు. మంగళగిరి పట్టణంలో ఆశావర్కర్లుగా పనిచేస్తున్న తమకు పనికి తగ్గ జీతం ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని, సెలవులు మంజూరు చేయించాలని ఆశావర్కర్లు కోరారు.
2022 సంవత్సరంలో వెలువడిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ యువత విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కొమ్మాది గ్రామంలో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పి.సన్యాసిరావుపై చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన బి.ప్రవీణ్ కుమార్ కోరారు. పరిమి కాలువ కింద తనకు మంజూరు చేసిన ఎకరం బంజరు భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన ఈ.విజయకుమారి కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన టి.కృష్ణ చైతన్య విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.