- కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై త్వరలో సీఎం చంద్రబాబుకు నివేదిక
- అల్లూరి జిల్లాలో ప్రత్యేక ఆధారిటీ ఏర్పాటు
- రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి
- సచివాలయంలో మంత్రుల బృందం భేటీ
అమరావతి (చైతన్యరథం); జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు చేరింది. దీనిపై అతి త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందం నిర్ణయించింది. కొత్త జిల్లాలు,
రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయనున్నారు. జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నిమ్మల రామనాయుడు, నాదెండ్ల మనోహర్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ వర్చువల్గా హాజరయ్యారు. సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం అందిన వివిధ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. ఈ చర్చల ఆధారంగా సీసీఎల్ఎ నివేదిక రూపొందిస్తుందని, దీనిపై మరోసారి చర్చించి సీఎం చంద్రబాబుకు అందిస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి ఆధారిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. ఆధారిటీ ఎలా ఏర్పాటు చేయాలి…ఏవిధంగా ఉండాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. కొత్తగా ఎనిమిది జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుండి వినతులు వచ్చాయని, కానీ పరిపాలనా పరంగా సౌలభ్యంగా ఉండే వాటిపైనే నిర్ణయం ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేరకు సానుకూల నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై కూడా చాలా ప్రతిపాదనలు వచ్చాయని, కొన్ని రెవెన్యూ డివిజన్లు దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కొత్త డివిజన్ల ఏర్పాటు పైన కూడా సుదీర్ఘంగా చర్చించామని, పరిపాలనా సౌలభ్యం మేరకు కొత్త డివిజన్ల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలపై కూడా లోతుగా చర్చించామన్నారు.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు మంచి సంకేతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బుధవారం ఏసీబీ తనిఖీలు చేయడం మంచి సంకేతమన్నారు. కూటమి ప్రభుత్వ పారదర్శకత పాలనకు ఇది నిదర్శనన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ప్రజల నుండి ఫిర్యాదులు అందాయని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, దీంతో అధికారుల్లోనూ భయం ఉంటుందని అన్నారు. గతంలో కూడా రిజిస్ట్రేషన్ శాఖపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకున్నామని, కొంత మందిని సస్పెండ్ కూడా చేశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.












