- సీఎం అడుగులకు మడుగులొత్తుతున్నారంటూ విరుచుకుపడ్డ వర్ల
- ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతానన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలి
- సభ్యతా, సంస్కారాలు లేని రాంగోపాల్ వర్మకు ఎదురేగి స్వాగతం పలుకుతారా
- చంద్రబాబు, పవన్, లోకేష్‌ను అవమానపరుస్తూ పోస్టర్ వేసిన వర్మను అరెస్ట్ చేయాలి
- టీడీపీ నాయకులకు అసలు అపాయింట్మెంటే ఇవ్వరా?
- మీ ఏకపక్ష వైఖరిపై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తాం
అమరావతి: ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతాను అని బహిరంగంగానే ప్రకటించిన తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనిగా మారింది. టీడీపీ నాయకులు అపాయింట్ మెంట్ కోరితే రాజేంద్రనాథరెడ్డి ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదు. మహిళా నాయకురాళ్లు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. వైసీపీ నాయకులు అపాయింట్మెంట్ కోరితే గేటు వద్దకొచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తారు, అదే టీడీపీ నాయకులు అపాయింట్ మెంట్ కోరితే మొండిచేయి చూపుతారు. సభ్యతా, సంస్కారాలు లేని వ్యూహం సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అపాయింట్మెంట్ అడిగితే డీజీపీ బయటికొచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. దేశ విదేశీయుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి చంద్రబాబు ముఖానికి, లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి.. ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.. ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ముఖానికి, 3,023 కిలో మీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన యువ నాయకుడు లోకేష్ ఫొటోకి దున్నపోతు తల పెట్టి పోస్టర్ విడుదల చేశారు. ఇటువంటి పోస్టర్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మర్యాదలు చేస్తారా? ముసి ముసి నవ్వులు నవ్వుతూ అతడితో ఫోటో దిగడం సిగ్గుచేటు. డీజీపీకి నైతిక విలువలు ఉంటే వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలి. కడుపు మండి కామెంట్ చేసిన యువకుడిని కాకుండా పొగరుతో కుల, మతాల మధ్య వైషమ్యాలు పెంచాలని పోస్టర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మని అరెస్టు చేయాలి. అరాచకాలను సృష్టిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యూహం సినిమా ను విడుదల కానీయకుండా చూడాలి. డీజీపీ వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డు కు లేఖ రాయాలి. డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి ఏకపక్ష వైఖరిని కేంద్ర ప్రభుత్వ సంస్థ డీవోపీటీ (సిబ్బంది నియామకం, శిక్షణ సంస్థ) దృష్టికి తీసుకెళ్తాం. డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమాను రిలీజ్ కాకుండా గట్టిగా పోరాడాలి. తాడిపత్రి ఎమ్మెల్యే ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా అనడం చట్టాలను శాసించేలా ఉంది, అతన్ని వెంటనే అరెస్టు చేసి, బైండోవర్ చేయాలి. ఇకనైనా డీజీపీ బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ.. సమధర్మం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన అవసరముందని వర్ల హితవు పలికారు.
తప్పు చేసినవారిని శిక్షించాలి, మంచివారిని రక్షించాలి
తప్పు చేసినవారిని శిక్షించాలి, మంచివారిని రక్షించాలి కానీ డీజీపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సివున్నా ఆ విద్యుక్త ధర్మాన్ని మరచిపోయారు. రాజేంద్రనాథరెడ్డి ఆయన విధులను విస్మరించి వెళ్తున్నారు. అత్యున్నత స్థానాన్ని జగన్ ఇచ్చారని, తాను బతికున్నంత కాలం జగన్ కు విశ్వాసపాత్రుడిగా ఉండాలని డీజీపీకి అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రే డీజీపీని ఎంపిక చేసుకుంటారు, అంతమాత్రాన సీఎం అడుగులకు డీజీపీ మడుగులొత్తాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని పాటించాలి, చట్టాన్ని పరిరక్షించాలి. ఇది మరచి వైసీపీని కాపాడటం కోసం, మిగతా పార్టీలను తన్ని తరిమేయాలని చూస్తున్నారు. ఇది ధర్మమా అని వర్ల ప్రశ్నించారు.
డీజీపీగా ప్రమాణం చేసినదానికి చేస్తున్నదానికి సంబంధం లేదు
ఐపీఎస్ గా చేసిన ప్రమాణానికి ప్రస్తుతం డీజీపీ చేస్తున్నదానికి ఏమైనా సంబంధం ఉందా? టీడీపీ ప్రతిపక్ష పార్టీ. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఇనుప పాదం మోపాలని చూస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యర్థి పార్టీలకు రక్షణగా, అండగా ఉండాలి. కనీసం వారి వినతులు తీసుకోవాలన్న బాధ్యతను కూడా డీజీపీ విస్మరించారు. రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పాలన జరుగుతోంది, మీతో చెప్పుకోవాలి, మీ అపాయింట్ మెంట్ ఇవ్వండని టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా డీజీపీని తాను ఎన్ని సార్లు అడిగినా ఇవ్వలేదని వర్ల తప్పుబట్టారు. టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడానికి వస్తున్నారంటే కిలో మీటరు దూరంలో బ్యారికేడ్లు పెట్టి ఆపుతారు. టీడీపీ తరపున ఫిర్యాదులను చిన్నా, చితక ఆఫీసర్లకు ఇవ్వమంటారు. మేమిచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కదానిపైనైనా చర్యలు తీసుకున్నారా అని వర్ల ప్రశ్నించారు.
వ్యూహం సినిమా రిలీజ్ కాకుండా చూడాలి
డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమా రిలీజ్ కాకుండా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. డీజీపీకి తాను ఏదైనా చట్టపరంగా చేస్తానని చెప్పే ధైర్యముందా? మా నాయకుల ఫొటోలకు దున్నపోతు ఫోటోలు ఎలా పెడతారు? అలా పెట్టి పోస్టర్ రిలీజ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఓ కుర్రాడు టీవీ ఛానల్ లో కూర్చొని ఏదో కామెంట్ చేస్తే అతన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అన్యాయం. కడుపు మండి కామెంట్ చేస్తే ఇంతగా చేయాలా. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కాల్చి పడేయండన్నాడు. దానికి దీనికి తేడా ఏమీ లేదు. ఇతను తలకాయ అడిగాడు, అతను కాల్చిపడేయమన్నాడు. రెండిరడిలో తేడా ఏమైనా ఉందా? ఇతనిమీద చర్య తీసుకుంటే జగన్ మీద తీసుకోరా? మీరు పోలీసు ఆఫీసరేనా? జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ గా మారింది. చట్టబద్దంగా వ్యవహరించకపోతే డీఓపీటీని మా ప్రతినిధి బృందం కలుస్తుంది. ఈ డీజీపీ.. ఐపీఎస్ అధికారిగా పనికిరారని సాక్ష్యాధారాలతో సహా మేం నిరూపిస్తాం. వ్యూహం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది కనుక ఈ సినిమా విడుదల కాకుండా చూసే బాధ్యత తన భుజ స్కందాలపై ఉందని డీజీపీ గుర్తించాలని వర్ల రామయ్య సూచించారు.