- తెలుగుదేశం కార్యకర్త మిర్చి తోటను పీకేసిన దుండగులు
- మిర్చి మొక్కలు పీకిన ప్రాంతంలో వైసీపీ జెండాలు ఉంచి కవ్వింపు చర్యలు
పల్నాడు (చైతన్యరథం): పల్నాడు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త వెంకటేశ్వర్లు మిర్చి తోటను వైసీపీ మూకలుగా భావిస్తున్న దుండగులు ధ్వంసం చేశారు. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లు మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. సోమవారం పొలానికి వెళ్లే సరికి అందులో అర ఎకరం విస్తీర్ణంలో మొక్కలు పీకేసి ఉన్నాయి. చేతులకు గ్లౌజులు వేసుకుని మరీ మొక్కలు పీకివేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ గ్లౌజుల్ని కూడా పొలంలోనే పడేశారు. తాగేసిన మద్యం సీసాలు కూడా అక్కడే వేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిరది ఎవరనేది తెలియకుండా దుండగులు జాగ్రత్త పడ్డారు. రైతు ఎక్కల వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తనపై కక్షగట్టి వైసీపీ నేతలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లోనే మిర్చి కోతలు ప్రారంభించాల్సి ఉన్న తరుణంలో పంటను నాశనం చేసి వెళ్లటంపై కన్నీరు పెట్టుకున్నారు. పుట్టింటి వాళ్లు పసుపు, కుంకుమ కింద ఇచ్చిన పొలంలో ఇలాంటి విధ్వంసానికి పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. మిరప మొక్కలను పీకేసిన దుండగులు పొలంలో వైసీపీ జెండాలు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి పనులు ఇంతకుముందెన్నడూ చూసింది లేదని ఈ ఘటన చూసిన స్థానికులు సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం తరుపున క్రియాశీలంగా పనిచేస్తున్నారనే కారణంతో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని బాధిత కుంటుంబ సభ్యులు వాపోయారు. పంట ఉన్న భూమి గురించి ఎటువంటి వివాదాలు కూడా లేవని బాధితులు పేర్కొన్నారు.